: 2019లో కచ్చితంగా పోటీ చేస్తాను... నా భుజం మీదున్నది 'గబ్బర్ సింగ్' తుండు కాదు!: పవన్ కల్యాణ్

2019 ఎన్నికల్లో జనసేన కచ్చితంగా పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ తెలిపారు. తాను కూడా పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. అయితే తనకు అధికారం ముఖ్యం కాదని ఆయన అన్నారు. అధికారం ఆశించి తాను రాజకీయపార్టీ పెట్టలేదని ఆయన చెప్పారు. ప్రజలు చిత్తశుద్ధి కలిగిన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, అలాంటి నాయకులనే తాను ఎంచుకుంటానని ఆయన తెలిపారు. పలువురు నేతలు తనతో కలిసేందుకు వస్తున్నారని, అయితే ప్రజల కోసం కష్టాలకు వెరవని నాయకుల కోసం తాను చూస్తున్నానని ఆయన అన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడే ఒక నాయకుడి అసలు నైజం వెల్లడవుతుందని ఆయన చెప్పారు. తన భుజం మీద ఉండేది గబ్బర్ సింగ్ సినిమాలోని తుండు కాదని ఆయన తెలిపారు. ఈ తుండుకి కుల, మత, వర్గ, వర్ణ, భావ భేదాలు తెలియవని ఆయన తెలిపారు. అందుకే తాను దీనిని భుజంపై ధరిస్తానని ఆయన అన్నారు.

చేనేతను వాడుతున్నందుకు గర్వపడుతున్నానని ఆయన చెప్పారు. ప్రతిఒక్కరూ తనలా చేనేత ధరించి, వారికి చేయూతనివ్వాలని ఆయన సూచించారు. వారానికి ఒక్కరోజైనా చేనేత వస్త్రాలు ధరించండి అని ఆయన పిలుపునిచ్చారు. ప్రత్యేకహోదా గురించి ఎందుకు వాస్తవాలు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. 'స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నారు, తరువాత ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తామని అన్నారు. ఇప్పుడు చట్టబద్ధత అవసరం లేదని అంటున్నారు. మీకు చేతకానప్పుడు ఎందుకు హామీలు ఇస్తారు?' అంటూ ఆయన నిలదీశారు. తనకు ఒక్కరు ఓటేసినా, కోట్లాదిమంది ఓట్లేసినా ప్రజల పక్షానే నిలబడతానని ఆయన అన్నారు. రాజకీయ మురికిలోకి ఎందుకు అడుగుపెడతావయ్యా? అని చాలా మంది తనను హెచ్చరించారని ఆయన చెప్పారు. అయితే తాను లోపల నిర్మలంగా, శుభ్రంగా ఉన్నానని, మురికిలోకి వెళ్లినా...తాను మురికిని కడుక్కోగలనని పవన్ కల్యాణ్ తెలిపారు.

More Telugu News