: 21, 22 తేదీల్లో ఏపీలో కేసీఆర్... పర్యటన ఖరారు!

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో తన కోరిక సిద్ధిస్తే, తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి ఆభరణాలు చేయిస్తానని ఆయన మొక్కుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన కోరిక తీరడంతో, ప్రభుత్వం తరఫున తయారు చేయించిన రూ. 5 కోట్ల విలువైన ఆభరణాలను తీసుకుని ఆయన వెంకటేశ్వరుని దర్శనానికి రానున్నారు. 21 మంగళవారం సాయంత్రం తిరుపతి చేరుకునే కేసీఆర్, రాత్రికి తిరుమలలో బస చేసి, ఆపై 22న ఉదయాన్నే స్వామి వారిని దర్శించుకుని ఆభరణాలను బహూకరించనున్నారు. ఆపై తిరుపతికి వచ్చి అలివేలు మంగాపురంలో అమ్మవారికి మొక్కులు చెల్లించి, అక్కడి నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు.

కాగా,  వెంకన్నకు రూ. 5 కోట్ల విలువైన ఆభరణాలను కేసీఆర్ ఆదేశాల మేరకు కోయంబత్తూరుకు చెందిన కీర్తిలాల్ జ్యూయెలరీస్ తయారు చేసిందన్న సంగతి తెలిసిందే. వీటిల్లో రూ. 3.7 కోట్ల విలువైన 14.2 కిలోల సాలగ్రామ హారం, రూ. 1.21 కోట్ల విలువైన 4.65 కిలోల కంఠాభరణాన్ని తెలంగాణ ప్రభుత్వం చేయించింది. అలివేలు మంగమ్మకు బంగారు ముక్కుపుడకను కేసీఆర్ సమర్పించనున్నారు. కొందరు మంత్రులు, బంధు మిత్రులతో కలసి ప్రత్యేక విమానంలో కేసీఆర్ రేణిగుంటకు చేరుకుంటారని తెలుస్తోంది.

More Telugu News