: అయితే అధికారం... కాదంటే ఎన్నికలు... స్టాలిన్ ప్లాన్ ఇదే!

తమిళనాడులోని అధికార అన్నాడీఎంకేలో నెలకొన్న సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని, ఏదైనా లాభం ఉంటుందంటే తప్ప, ఈ వ్యవహారంలో కల్పించుకోరాదని డీఎంకే భావిస్తున్నట్టు తెలుస్తోంది. పన్నీర్ సెల్వం వర్గంలోకి కనీసం 40 నుంచి 50 మంది వరకూ రావచ్చని తొలుత అంచనాలున్న నేపథ్యంలో, ఆ పార్టీకి మద్దతిస్తామన్న సంకేతాలు పంపిన డీఎంకే, ఇప్పుడు అటువంటి ఆలోచనేదీ లేదని చెబుతోంది. ఇక పన్నీర్ వెంట ఓ 20 మంది వరకూ కలిసొస్తే, ఆయన మద్దతుతో తాము ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నది స్టాలిన్ ఆలోచన.

తన తండ్రిని మరోసారి సీఎం పీఠంపై కూర్చోబెట్టాలన్న ఏకైక లక్ష్యంతో ఆయన పావులు కదుపుతున్నారు. ఒకవేళ అసెంబ్లీలో బల నిరూపణ జరిగితే, అధిక ఎమ్మెల్యేలు ఉన్న పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆయన ఇప్పటికే ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేలంతా అందుబాటులో ఉండాలని చెప్పారు. ఇక ప్రస్తుతం పన్నీర్ శిబిరంలో పది మంది ఎమ్మెల్యేలు కనిపిస్తున్నారు. పళనిస్వామి వద్ద 124 మంది ఉన్నట్టు సమాచారం. డీఎంకే కు 89 మంది, దాని మిత్రపక్షమైన కాంగ్రెస్ కు 8 మంది ఎమ్మెల్యేలుండగా, ఎట్టి పరిస్థితుల్లోనూ పళనిస్వామిని సీఎం కానీయకుండా చూడటమే స్టాలిన్ ముందున్న ఏకైక లక్ష్యంగా తెలుస్తోంది. ఇక ప్రభుత్వం కుప్పకూలితే, ఎన్నికలకు వెళ్లి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని ఆయన భావిస్తున్నారు.

More Telugu News