: నువ్వా?.. నేనా?.. అంటున్న పన్నీర్, పళనిస్వామి!

సుప్రీం తీర్పుతో శశికళ శకం ముగిసిపోయినట్టే. నిన్నమొన్నటి వరకు ముఖ్యమంత్రి పీఠం కోసం శశికళతో పోటీపడిన పన్నీర్ సెల్వానికి నేడు పళనిస్వామి సవాల్ విసురుతున్నారు. సుప్రీం తీర్పుతో కంగుతిన్న శశికళ వర్గం పళనిస్వామిని మంగళవారం శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఎన్నికైన వెంటనే పళనిస్వామి ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు ఫ్యాక్స్ చేశారు. సాయంత్రం గవర్నర్‌ను కలిసి లేఖ అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని, తనను ఆహ్వానించాలని కోరారు. ఆ తర్వాత కొద్దిసేపటికే పన్నీర్‌కు మద్దతు తెలుపుతున్న ఎంపీ మైత్రేయన్, మాజీ ఎంపీ మనోజ్ పాండ్యన్ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు.

కాగా పళని స్వామి, పన్నీర్ సెల్వం బద్ధ విరోధులని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘అమ్మ’కు విధేయులైన ఈ ఇద్దరూ ఇప్పుడు బలనిరూపణకు సై అంటే సై అంటున్నారు. బలనిరూపణకు సిద్ధమంటున్న రెండు వర్గాల్లో ఏ ఒక్కరిని తొలుత ఆహ్వానించినా విమర్శలు కొని తెచ్చుకోవడమే అవుతుందని గవర్నర్ యోచిస్తున్నారు. అయితే మధ్యేమార్గంగా అటార్నీ జనరల్ సూచించినట్టు ‘కాంపోజిట్’ బలపరీక్ష నిర్వహించాలని విద్యాసాగర్‌రావు నిర్ణయించినట్టు తెలుస్తోంది. తద్వారా మెజారీటీ ఉన్నవారే ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొస్తారని, ఎదురవబోయే విమర్శల నుంచి కూడా తప్పించుకోవచ్చని గవర్నర్ భావిస్తున్నట్టు రాజ్‌భవన్ వర్గాల భోగట్టా.

More Telugu News