: రష్యా రాయబారిని కాల్చిచంపుతుండగా తీసిన ఫొటోకు అవార్డు!

గత ఏడాది డిసెంబరులో టర్కీ రాజధాని అంకారాలో నిర్వహించిన ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో రష్యా రాయబారి ఆండ్రీ కర్లోవ్ ను ఓ వ్యక్తి కాల్చిచంపిన సంఘటన గుర్తుండే ఉంటుంది. ఈ సంఘటనలో ఆండ్రీ కర్లోవ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఆ వ్యక్తి కాల్పులకు పాల్పడుతుండగా అక్కడున్న వారందరూ తలో వైపు పరుగులు తీశారు. కానీ, అసోసియేటెడ్ ప్రెస్ కు చెందిన బుర్హన్ ఓజ్ బిల్పి అనే ఫొటో గ్రాఫర్ మాత్రం బెదరలేదు. తన వృత్తి ధర్మాన్ని మరవలేదు. ఆండ్రీ కర్లోవ్ ను అందరూ చూస్తుండగా కాల్చి వేసిన ఆ సంఘటనను తన కెమెరాలో బంధించాడు.

 తాజాగా వరల్డ్ ప్రెస్ ఫొటో అవార్డుకు ఆ ఫొటోను ఎంపిక చేశారు. ఈ పోటీకి 125 దేశాలకు చెందిన 5,034 మంది ఫొటోగ్రాఫర్లు తీసిన సుమారు 80,400 ఫొటోలు పంపించారు. ఆ ఫొటోలన్నింటిలో ఈ ఫొటోను ఎంపిక చేసి, బుర్హన్ ను విజేతగా ప్రకటించారు. ఈ సందర్భంగా జ్యూరీ సభ్యుడు మేరీ కాల్వెర్ట్ మాట్లాడుతూ, అన్ని వేల ఫొటోల్లో ఒక్క ఫొటోను ఎంపిక చేసేందుకు చాలా శ్రమించాల్సి వచ్చిందని అన్నారు. విజేత బుర్హన్ ఓజ్ బిల్సి స్పందిస్తూ.. తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించానని, ప్రాణ భయంతో అక్కడి నుంచి పారిపోలేదని అన్నారు. కాగా, ఆండ్రీ కర్లోవ్ ను హతమారుస్తుండగా తీసిన ఈ ఫొటో సంచలనం సృష్టించింది. 

More Telugu News