: పెద్ద నోట్లకు నకిలీ నోట్లు! రంగంలోకి దిగిన ఎన్ఐఏ, బీఎస్ఎఫ్ దళాలు

పెద్ద నోట్లకు ‘నకిలీ’ కరెన్సీ ట్రయల్ రన్ మొదలైంది. రూ.2 వేలు, రూ.500 నకిలీ నోట్లను ఐఎస్ఐ భారత్ లో ప్రవేశపెట్టింది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఈ నకిలీ కరెన్సీ బాగోతం వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), సరిహద్దు రక్షణ దళాలు (బీఎస్ఎఫ్) రంగంలోకి దిగాయి. ఈ కేసు దర్యాప్తునకు సంబంధించిన ఓ అధికారి మాట్లాడుతూ, రెండు వేల రూపాయల నకిలీ నోట్లు నలభై తీసుకువెళుతున్న అజిజుర్ రహమాన్ (26) అనే వ్యక్తిని ఈ నెల 8వ తేదీన ముషీదాబాద్ లో అరెస్టు చేశామన్నారు.

 రహమాన్ పశ్చిమ బెంగాల్ లోని మాల్దాకు చెందిన వ్యక్తి అని, ఈ విషయమై ఆరా తీయగా, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) సాయంతో ఈ నకిలీ నోట్లు పాకిస్థాన్ లో ముద్రించినట్లు తెలిసిందని అన్నారు. ఆ నోట్లను బంగ్లాదేశ్ సరిహద్దు ద్వారా భారత్ లోకి తరలిస్తున్నారని, ఈ నకిలీ నోట్లను పసిగట్టడం కష్టమని, ఇవి మార్కెట్ లోకి వస్తాయేమోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నకిలీ కరెన్సీ ట్రయల్ రన్ కింద రెండు వేలు, ఐదు వందల నోట్లను కొంచెం మొత్తంలో వారు విడుదల చేసినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. కాగా, కొత్త నోట్ల నకిలీ కరెన్సీకి సంబంధించి మొట్టమొదట పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తులు మాల్దాకు చెందిన వారు.  

More Telugu News