: భారత్ బలం, మా బలహీనత ఇదే!: బంగ్లా కెప్టెన్

హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ లో భారత్ తో ఓటమి అనంతరం బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ మాట్లాడుతూ, టీమిండియాకు టెయిలెండర్లే బలమని అన్నాడు. బంతితో రాణిస్తూ, అవసరమైనప్పుడు టీమిండియా టెయిలెండర్లు నిలకడగా రాణిస్తున్నారని అన్నాడు. వారే జట్టుకు అదనపు పరుగులు జోడిస్తున్నారని చెప్పాడు. ఏ జట్టులోనైనా స్పిన్నర్లు లేదా పేసర్లు వైవిధ్యమైన బంతులు విసురుతూ ఆకట్టుకుంటారని, కానీ వరల్డ్ నెంబర్ వన్ టీమిండియాలో మాత్రం స్పిన్నర్లు బంతిని అన్ని వైపులా తిప్పడంతో పాటు పేసర్లు పిచ్ ను తమకు అనుకూలంగా మలచుకుంటూ బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తున్నారని చెప్పాడు. ఫీల్డింగ్ లో టీమిండియా తప్పులు చేయడం లేదని అన్నాడు.

బ్యాట్స్ మన్ కొట్టిన బంతి కోసం ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లు పోటీ పడుతున్నారని అన్నాడు. ఇన్ని సానుకూలాంశాలు ఉన్నాయి కనుకే భారత జట్టు వరల్డ్ నెంబర్ వన్ గా నిలిచిందని కితాబునిచ్చాడు. భారత్ తో ఆడడం తమకు లాభించిందని చెప్పాడు. తమ లోపాలు తెలిశాయని చెప్పాడు. భారత్ కు తాము తేలిగ్గా లొంగలేదని చెప్పాడు. మరొక్క సెషన్ ఆడి ఉన్నా, భారత్ ను తొలి ఇన్నింగ్స్ లో 500 పరుగులకు నియంత్రించినా పరిస్థితి వేరేలా ఉండేదని అన్నాడు. అనుభవలేమితోపాటు, ఫీల్డింగ్ లో చేసిన తప్పిదాలు తమను ఓటమిపాలు చేశాయని ఆవేదన వ్యక్తం చేశాడు. 

More Telugu News