: ఉద్యోగాల ఆశచూపి... గుజరాత్ బీజేపీ కార్యకర్తల అత్యాచారపర్వం

గుజరాత్ లోని కచ్ జిల్లాలో 35 మంది యువతులపై బీజేపీ కార్యకర్తల అత్యాచారపర్వం కలకలం రేపుతోంది. కచ్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 35 మంది యువతులపై అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు బీజేపీ కార్యకర్తలను పార్టీ సస్పెండ్ చేయగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... కచ్ జిల్లాకు చెందిన ఓ యువతికి నెలకు 5,500 రూపాయల వేతనంతో ఉద్యోగమిస్తానని చెప్పి బీజేపీ కార్యకర్త, గ్యాస్ ఏజెన్సీ యజమాని అయిన శాంతిలాల్ సోలంకీ తన ఇంటికి పిలిపించుకున్నాడు. అసాధారణ రీతిలో ఆమెకు అడ్వాన్సు జీతం ఇచ్చాడు. జీతంతో పాటు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ను ఆఫర్ చేశారు. ఆ డ్రింక్ తాగి, ఆమె మత్తులోకి జారుకోగానే అమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను హోటళ్లు, ఇళ్లలోకి మారుస్తూ అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ దారుణానికి ఒడిగట్టేందుకు అబ్దాస, గోవింద్ పారుమలానీ, అజిత్ రమావాణి, వసంత్ భానుశాలిలు శాంతిలాల్ సోలంకీకి సహాయం చేశారు. వారు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో మరో 34 మంది యువతులు కూడా ముందుకు వచ్చారు. ఉద్యోగం పేరుతో తమను కూడా మోసం చేశారని, వ్యభిచారిణులుగా చేశారని పోలీసులకు తెలిపారు.

దీంతో అప్రమత్తమైన బీజేపీ గుజరాత్ ప్రధాన కార్యదర్శి వారిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తరువాత రంగంలోకి దిగిన బీజేపీ గుజరాత్ అధికార ప్రతినిధి భరత్ పాండ్య మాట్లాడుతూ, నకిలీ పార్టీ గుర్తింపు కార్డులతో వారు పార్టీ కార్యకర్తలని చెబుతున్నారని, వారికి, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై గుజరాత్ లో పెను కలకలం రేగుతోంది. 

More Telugu News