: శశికళ గురించి జయలలిత స్నేహితులు, సన్నిహితులు ఏమంటున్నారంటే...!

ఒకవైపు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు షాకులు తగులుతుంటే... మరోవైపు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు అనూహ్యంగా మద్దతు పెరుగుతోంది. జయలలిత చిన్ననాటి స్నేహితులు, సన్నిహితులు కూడా శశికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంతేకాదు, వారంతా పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటిస్తున్నారు. పన్నీర్ పైనే జయలలితకు పూర్తి విశ్వాసం ఉందని... అందుకే ఆయనను జయ ముఖ్యమంత్రిని చేశారని చెబుతున్నారు. శశికళ వ్యవహారశైలి దారుణంగా ఉందని... అన్నాడీఎంకేలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు బాధను కలిగిస్తున్నాయని తెలిపారు.

జయలలితకు చిన్ననాటి స్నేహితులను శశికళ దూరం చేసిందని చాందిని పంకజ్ బులానీ ఆవేదన వ్యక్తం చేశారు. తాను డెలివరీ అయినప్పుడు హాస్పిటల్ కు వచ్చి జయ పరామర్శించారని... ఆ తర్వాత జయను కలిసే అవకాశాన్ని కూడా శశికళ ఇవ్వలేదని ఆమె మండిపడ్డారు. జయను కలిసేందుకు ఒకసారి పన్నీర్ సెల్వం అపాయింట్ మెంట్ ఇచ్చారని.. కానీ, శశికళ మనుషులు తనను అడ్డుకున్నారని చెప్పారు. తమ స్నేహితులెవరూ జయను కలవకుండా శశికళ దూరం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నీర్ సెల్వం మాత్రం చాలా గొప్ప వ్యక్తి అని... చివరిసారి తాము జయతో కలసి భోజనం చేసినప్పుడు ఆయన కూడా అక్కడే ఉన్నారని చెప్పారు.

పన్నీర్ సెల్వం వంటి వారిని తన రాజకీయ వారసుడిగా జయ ప్రకటించి ఉంటే బాగుండేదని ఆమె స్నేహితురాలు శ్రీమతి అయ్యంగార్ అన్నారు. జయలలిత ఆశయాలను కేవలం పన్నీర్ సెల్వం మాత్రమే నెరవేరుస్తారని బాదర్ సయీద్ తెలిపారు.

More Telugu News