: భర్త వరకట్న వేధింపులకు హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బలి!

దురాశాపరుడైన భర్త వరకట్న వేధింపులు తాళలేకపోయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాదులోని వెంగళరావునగర్‌ డివిజన్‌ రాజీవ్‌ నగర్‌ లో చోటుచేసుకుంది. మచిలీపట్నానికి చెందిన సూరారపు బ్రహ్మయ్య కుమార్తె భార్గవి (25) ఇంక్ పాడ్ సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. హైదరాబాదు, మధురానగర్ లోని వామన్ కన్సల్టెన్సీలో హెచ్ఆర్ శాఖలో పని చేస్తున్న ఉమ్మడిశెట్టి నరేంద్రతో గత మార్చి 20వ తేదీన ఘనంగా వివాహం చేశారు. ఈ సందర్భంగా నరేంద్రకు 25 లక్షల రూపాయల నగదు, 20 తులాల బంగారు ఆభరణాలు, ఆదిభట్లలో ఒక ప్లాట్‌ ను వరకట్నంగా ఇచ్చారు.

వివాహం జరిగిన నెల రోజులకే నరేంద్ర అసలు రంగు చూపించాడు. అదనపు కట్నం కావాలని భార్యను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో బ్రహ్మయ్య కుమార్తె క్షేమం కోరి ఐదు లక్షల రూపాయలు అదనంగా ఇచ్చారు. అయినా నరేంద్ర ధనదాహం తీరకపోవడంతో భార్యను ఐదు నెలల పాటు వేధిస్తున్నాడు. దీనిని తట్టుకోలేకపోయిన భార్గవి బంధువులకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పింది. దీంతో ఆమె నివాసానికి చేరుకున్న బంధువులు తలుపులు బద్దలుకొట్టి చూసేసరికి ఆమె ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. దీంతో బ్రహ్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు నరేంద్రను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు పంపించారు. 

More Telugu News