: యుద్ధం వస్తే కనీసం పది రోజులకు సరిపడా మందుగుండు... రూ. 20 వేల కోట్లతో హడావుడిగా కొనుగోలు చేస్తున్న మోదీ సర్కారు!

ఏదైనా యుద్ధం చేయాల్సి వస్తే, కనీసం పది రోజుల పాటు సరిపడా మందుగుండు సామాగ్రిని సాయుధ దళాలకు సిద్ధంగా ఉంచాలన్న లక్ష్యంతో నరేంద్ర మోదీ సర్కారు భారీ ఎత్తున మందుగుండును కొనుగోలు చేస్తోంది. గడచిన రెండు నెలల కాలంలో యుద్ధ విమానాలు, ట్యాంకర్లు, భద్రతా దళాలు, యుద్ధ నౌకల్లో యుద్ధానికి వినియోగించే రాకెట్లు, బాంబులు, తుపాకి గుళ్ల కోసం రూ. 20 వేల కోట్లతో ఢిఫెన్స్ కంపెనీలతో డీల్స్ కుదుర్చుకుంది. నిరవధికంగా కనీసం 10 రోజుల పాటు భారత సైన్యం యుద్ధం చేయగలిగేలా తయారు చేయడమే తమ ఉద్దేశమని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా రష్యా, ఇజ్రాయిల్, ఫ్రాన్స్ దేశాలతో కొత్త కాంట్రాక్టులు కుదుర్చుకున్నామని, యూరీ సైనిక స్థావరంపై సెప్టెంబర్ 18న జరిగిన ఉగ్రదాడి తరువాత ఈ డీల్స్ కుదిరాయని ఓ అధికారి తెలిపారు.

ఇప్పటికే ఆర్మీ, నావీ, ఐఏఎఫ్ వైస్ చీఫ్ లకు అత్యవసర ఫైనాన్షియల్ పవర్స్ ఇచ్చి, సాధ్యమైనంత త్వరలో ఆయుధ సంపత్తిని పది రోజులకు సరిపడగా సిద్ధం చేసుకోవాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. సైన్యం ఆధునికీకరణ కోసం 2017-18 బడ్జెట్ ప్రతిపాదనల్లో కేటాయింపులు తగ్గించినప్పటికీ, మొత్తం రూ. 86,488 కోట్లను రక్షణ రంగానికి జైట్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాగా, సుఖోయ్-30 ఎంకేఐ, మిరేజ్-2000ఎస్, మిగ్ 29ఎస్ లతో పాటు రవాణా విమానాలైన ఐఎల్-76ఎస్, గాల్లోనే ఇంధనాన్ని నింపే సామర్థ్యమున్న ఐఎల్-78ఎస్, ఫాల్కన్ అవాక్స్ (ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్)కు అవసరమైన మందుగుండు, క్షిపణుల కోసం భారత వాయుసేన రూ. 9,200 కోట్ల విలువైన 43 కాంట్రాక్టులను వివిధ సంస్థలతో కుదుర్చుకుంది. ఇక ఆర్మీ విషయానికి వస్తే, రష్యా కంపెనీలతో రూ. 5,800 కోట్ల విలువైన 10 కాంట్రాక్టులను కుదుర్చుకుంది. ఇందులో భాగంగా టీ-90ఎస్, టీ-72 ట్యాంకులు, కాంకర్స్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిసైల్స్, స్మెర్చ్ రాకెట్స్ కు అవసరమైన 125 ఎంఎం ఏపీఎఫ్ఎస్డీఎస్ మందుగుండు సహా తేలికపాటి క్షిపణులు భారత్ కు అందనున్నాయి.

వివిధ రకాల సైనిక విభాగాలను అన్ని రకాలుగా సమాయత్తం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని రక్షణరంగ అధికారి ఒకరు తెలిపారు. ఇండియాకున్న 13 లక్షల మంది సైన్యం కనీసం 40 రోజుల పాటు యుద్ధ రంగంలో నిలిచేందుకు సిద్ధంగా లేదన్న వాస్తవం బహిర్గతమైన తరువాత, సైన్యానికి సరిపడా మందుగుండును అందిస్తామని ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

More Telugu News