: ఉద్యోగులైన దంపతులు ఒకే చోట పనిచేసేలా బదిలీలు ఉండాలి: సీఎం కేసీఆర్

సమస్యల తక్షణ పరిష్కారం నిమిత్తం ప్రతి జిల్లా కలెక్టర్ వద్ద రూ.5 కోట్లు ఉంచుతామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ఈరోజు ఆయా జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పెండింగ్ లోఉన్న కారుణ్య నియామకాలు పది రోజుల్లో పూర్తి చేయాలని, ఏడాది లోపు అన్ని జిల్లా కలెక్టరేట్లు, పోలీస్ కార్యాలయాల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు.

ఉద్యోగులైన దంపతులు ఒకే చోట పని చేసేలా బదిలీలు జరగాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మహిళలకు ఆత్మ రక్షణ విద్య అన్ని చోట్ల నేర్పాలని, ‘క్లీన్ ద విలేజ్’ పేరిట పరిశుభ్రమైన గ్రామాలకు కలెక్టర్ అవార్డు పేరిట నగదు ప్రోత్సాహం అందించాలని, దళిత కాలనీలు, తండాలకు కలెక్టర్లు అవార్డులు ఇవ్వాలని ఆదేశించారు.

కుటుంబంలో కనుక ‘ఆసరా’ పెన్షన్ లబ్ధిదారులతో పాటు బీడీ కార్మికులు ఉంటే వారికి భృతి కల్పించాలని, గుడుంబా నివారణ చర్యలతో పాటు తయారీదారులకు ఉపాధి కల్పించాలని సీఎం ఆదేశించారు. ‘మన ఊరు- మన ప్రణాళిక’ కార్యక్రమం మరోసారి నిర్వహించాలని, దశల వారీగా గ్రామాల్లో అందరి అవసరాలు తీర్చాలని, లబ్ధిదారుల ఎంపికకు లాటరీ పద్ధతిని అనుసరించాలని సూచించారు.

More Telugu News