rajamouli: ఆయ‌న ఎప్పుడూ వెటకారంగా మాట్లాడతారు: సోదరుడి గురించి దర్శకుడు రాజమౌళి

ఎస్‌.ఎస్‌.కాంచీ దర్శకత్వంలో రామ రీల్స్‌ పతాకంపై తెర‌కెక్కించిన ‘షో టైమ్‌’ సినిమా ఆడియో విడుదల కార్యక్ర‌మానికి హాజ‌రైన‌ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి మాట్లాడుతూ త‌న క‌జిన్ కాంచీ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలిపారు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మర్యాద రామన్న సినిమాతో పాటు ‘ఈగ’ చిత్రానికి కాంచీ రచయితగా ప‌నిచేసిన విష‌యం తెలిసిందే. తాము తొమ్మిది మంది కజిన్స్ అని, అందులో త‌న‌కు అన్న‌య్య‌ కాంచీ ఒకర‌ని రాజ‌మౌళి అన్నారు. ఆయ‌న ఎప్పుడూ వెటకారంగా మాట్లాడతారని, ఆయ‌న‌ మాట్లాడే ప్రతి మాట వెనుక అది ఉంటుంద‌ని  రాజ‌మౌళి చెప్పారు.
 
నిజానికి కాంచీ ఎప్పుడో ద‌ర్శ‌కుడు కావాల‌ని కానీ ఎంతో ఆలస్యం అయిందని రాజ‌మౌళి చెప్పారు. ఆయ‌న‌ది అందిరిలోనూ తప్పులు చూపించే మ‌నస్త‌త్వ‌మ‌ని చెప్పిన జ‌క్క‌న్న‌... కాంచీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తప్పులు ఉండకూడదని తాను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సినిమా ట్రైలర్ ఎంతో అద్భుతంగా ఉందని, ఈ ట్రైల‌ర్‌ చూసిన ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని చూడాలనుకుంటారని అన్నారు. ఈ సినిమాకు కీర‌వాణి అందించిన‌ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనవ‌స‌రం లేద‌ని అన్నారు. ఈ చిత్రంలో త‌మ కార్తికేయ పాట పాడాడని, అత‌ను ఇంత చ‌క్క‌గా పాడతాడని త‌న‌కు తెలియదని ఆయ‌న తెలిపారు.

More Telugu News