: చాహల్ పై అభినందనల వర్షం

టీమిండియాలో అతను స్టార్ ప్లేయర్ కాదు. సీనియర్ బౌలర్ అంతకన్నా కాదు. అనుభవమంతా ఐపీఎల్, రంజీల్లో రాణించడమే. అలాంటి ఆటగాడైన యజువేంద్ర చాహల్ అద్భుతం చేశాడు. మణికట్టు మాయాజాలం చూపిస్తూ చిన్నస్వామి స్టేడియంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తన రెండో ఓవర్ లో ధోనీ ఆగ్రహానికి గురైన చాహల్ తరువాత బంతితో మాయ చేశాడు. టీ20ల్లో ఎవరికీ సాధ్యం కాని ఫీట్ ను నమోదు చేశాడు. గుగ్లీలు, ఫ్లిప్పర్లతో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌ మెన్‌ ను ముప్పుతిప్పలు పెట్టిన యజువేంద్ర చాహల్‌ అంతర్జాతీయ క్రికెట్ లో టీ20ల్లో ఐదు వికెట్ల ఫీట్ సాధించిన తొలి భారత బౌలర్ గా నిలిచాడు.

తన తొలి ఓవర్లో వికెట్‌ తో శుభారంభం చేసిన చాహల్, తన మూడో ఓవర్లో వరుస రెండు బంతుల్లో క్రీజులో కుదరుకున్న కీలక బ్యాట్స్‌ మెన్‌ జాసన్ రాయ్, కెప్టెన్ మోర్గాన్ ను అవుట్‌ చేసి ప్రత్యర్థి కోట బద్దలు కొట్టాడు. తన చివరి ఓవర్లో రెచ్చిపోయి మరో మూడు వికెట్లు తీశాడు. అతనికి బుమ్రా జతకలవడంతో ఇంగ్లండ్ జట్టు చివర్లో కేవలం 8 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఘోరపరాజయం చవిచూసింది. దీంతో చాహల్ పై అన్నివైపుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దిగ్గజాలు అతని బౌలింగ్ విధానాన్ని ఆకాశానికెత్తుతున్నారు. 

More Telugu News