: నేను కనీసం ట్విట్టర్ ద్వారా నైనా మాట్లాడుతున్నాను... మరి మీరెక్కడ మాట్లాడుతున్నారు?: విమర్శకులకు పవన్ కల్యాణ్ సూటి ప్రశ్న

రాష్ట్ర విభజన సందర్భంగా ప్రత్యేకహోదాపై హామీనిచ్చింది కాంగ్రెస్, బీజేపీ పార్టీలేనని ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు. హైదరాబాదులో తనను చేనేత కార్మికులు కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హామీ ఇచ్చిన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎందుకు వెనుదిరుగుతోందని ఆయన నిలదీశారు. రాజకీయ పార్టీలు ఇచ్చిన మాట ఆ రాజకీయ పార్టీలే పాటించనప్పుడు అవే పార్టీలు చేసే చట్టాన్ని వారు అమలు చేస్తారని ఎందుకు నమ్మాలని ఆయన ప్రశ్నించారు.

ఉత్తరాది, దక్షిణాది అంటూ చిచ్చుపెట్టొద్దని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెబుతున్నారన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానమిస్తూ... 'మతాల మధ్య చిచ్చుపెట్టి, ఘర్షణలు ఎగదోస్తే పర్లేదా?' అని ఆయన అడిగారు. తాను ఉత్తరాది, దక్షిణాది అని చిచ్చుపెట్టడం లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కేవలం డిల్లీ వరకే పరిమితమై, ఎలైట్ గ్రూప్ లా తయారై, ఢిల్లీలో కూర్చుని చట్టాలు చేసేద్దామంటే అవి అమలు జరిగే పరిస్థితి ఉండదని, అలాంటి చర్యలను ప్రజలు అంగీకరించరని తాను చెబుతున్నానని ఆయన తెలిపారు.

 రాజకీయనాయకుల (ఎంపీల) ఆలోచన ప్రకారం కేవలం ఢిల్లీలోని నార్త్ బ్లాక్ లో కూర్చున్నవారే మేధావులు, చట్టాలు చేయగల వారు, వారికే అన్నీ తెలుసు అనుకోవడం సరికాదని ఆయన చెప్పారు. ఢిల్లీలో కూర్చుని తమిళనాడులో సమస్య, ఏపీలో సమస్య పరిష్కరిస్తామంటే కుదరదని ఆయన స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజాకాంక్షలు తెలుసుకోవాలని ఆయన సూచించారు. అలా కాకుండా నార్త్ బ్లాక్ లో కూర్చుని చట్టాలు చేస్తామంటే వారికి ఎంత అవగాహన ఉంటుందని ఆయన ప్రశ్నించారు.

'అప్పుడు కాంగ్రెస్ పదవీ కాలం ముగుస్తోంది. ఆ రాత్రి ముగిస్తే కాంగ్రెస్ తెలంగాణలో సమాధి అయిపోతుంది. అందుకే అలాంటి నేపధ్యంలో రాష్ట్ర విభజన అర్ధరాత్రి చేశారంటే ఓ అర్ధముంటుంది. కానీ అర్ధరాత్రి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించడానికి కారణమేంటి?' అని ఆయన నిలదీశారు. కన్వీనియేంట్ గా మాటలు మారుస్తూ, ప్రజల నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. స్పెషల్ ప్యాకేజీ, స్పెషల్ స్టేటస్ కు తేడా లేదని, ప్యాకేజీ ద్వారా ఏపీకి ఎక్కువే ఇస్తున్నామని చెప్పే మీరు... అంత హడావుడిగా, అర్ధరాత్రి స్పెషల్ ప్యాకేజీ ప్రకటించాల్సిన అవసరం ఏంటి? అంటూ బీజేపీని అడిగారు. ప్రజల ముందుకు వచ్చి ప్యాకేజీలో ఇంత ఎక్కువ ఇస్తున్నామని ఎందుకు చెప్పలేకపోయారని ఆయన నిలదీశారు.

మాముందున్న పరిష్కారమేంటి?

ఎవరేం చెప్పినా మేము వినము అని కేంద్రంలో అధికారం చేపట్టిన పార్టీ బహిరంగంగా అంటున్నప్పుడు తమ ముందున్న పరిష్కారమేంటని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము రోడ్డు మీదకు రాకుండా ఇంకేం చేయగలమని ఆయన ఎదురు ప్రశ్నించారు. 1960లలో హిందీ వ్యతిరేక ఉద్యమం వచ్చినప్పుడు, అప్పటి ఐఅండ్ పీఆర్ మంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ నేరుగా మద్రాసు వచ్చి, ఆందోళనకారులు, నేతలతో చర్చించి, సరే మీరు కోరుకున్నట్టే హిందీని మీమీద బలవంతంగా రుద్దమని చెప్పి వెళ్లడం వాస్తవం కాదా? అలా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే మీరేదో తప్పు చేస్తున్నారని... ప్రజలు అంగీకరించరని భయపడుతున్నారనేగా దానర్థం? అని ఆయన నిలదీశారు. అసలు అలా భయపడేపని ఎందుకు చేయాలని ఆయన ప్రశ్నించారు.

అవును, ట్విట్టర్లో మాట్లాడుతున్నాను

మీరు కేవలం ట్విట్టర్ కే పరిమితమవుతున్నారని ఆరోపిస్తున్నారన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ... అవును నేను ట్విట్టర్ లోనే మాట్లాడుతున్నాను... నేను కనీసం ట్విట్టర్ లోనైనా మాట్లాడుతున్నాను... మరి మీరెక్కడ మాట్లాడుతున్నారు? అని ఆయన ఎంపీలు, ఎమ్మెల్యేలను ప్రశ్నించారు.

ఏ పార్టీ గొప్పది?

'ఎన్నికలకు ముందు బీజేపీ తరపున పిలుపునిచ్చారు. ఇప్పుడు దానిని వ్యతిరేకిస్తున్నారు. అలాంటప్పుడు దానికి ఎందుకు మద్దతిచ్చారు?' అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ... తాను ప్రచారంలోకి వచ్చిన సమయంలో కేంద్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ అమానుషమైనవేనని స్పష్టం చేశారు... సిక్కుల ఊచకోతకు కాంగ్రెస్ కారణం కాదా?. అలాగే గోద్రా అల్లర్లు, రామమందిరం నిర్మాణం గొడవలు.. వీటిని ఏ పార్టీ రాజేసిందో అందరికీ తెలుసని ఆయన చెప్పారు. అయితే అప్పుడున్న పరిస్థితుల్లో తాను బీజేపీకి మద్దతిచ్చానని, అప్పట్లోనే తాను తన నద్దతిస్తున్న పార్టీలకు ఓటెయ్యమని ప్రజలను అడిగానని, అయితే ఆయా పార్టీలు సమస్యల పరిష్కారంలో వెనుదిరిగితే తానే రంగంలోకి దిగుతానని కూడా మాటిచ్చానని, ఇచ్చిన మాట ప్రకారమే తాను ప్రజల తరపున సమస్యలపై పోరాటానికి దిగుతున్నానని ఆయన తెలిపారు.

అవును.. సీపీఐ, సీపీఎంతో మాట్లాడాను

తాను వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎం పార్టీల నేతలతో మాట్లాడానని ఆయన స్పష్టం చేశారు. ఏ పార్టీ అయినా ప్రజాసమస్యలపై కలిసి పని చేయాల్సి ఉంటుందని, అయితే ఆ పోరాటంలో ఎవరి పద్ధతులు వారికుంటాయని ఆయన చెప్పారు. ప్రజల కోసం పోరాడేందుకు తాను వామపక్ష పార్టీలతో మాట్లాడానని, తాను ఏదో ఒక పార్టీకో లేక పక్షానికో మద్దతిచ్చే వ్యక్తిని కాదని, తాను కేవలం ప్రజాపక్షం తప్ప పార్టీల పక్షం కాదని ఆయన స్పష్టం చేశారు. తనకు ఇతర పార్టీలను కలుపుకుని ముందుకు తీసుకెళ్లేంత అనుభవం లేదని ఆయన స్పష్టం చేశారు. తనకు ఎవరితోనూ వ్యక్తిగతంగా విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. చిత్తశుద్ధి ఉంటే ఎవరితో అయినా పని చేస్తానని ఆయన చెప్పారు.  

More Telugu News