: ముంబై ఎయిర్‌పోర్టులో 12 వేల అడుగుల ఎత్తులో డ్రోన్.. గుర్తించిన విమాన పైల‌ట్‌.. ఏటీసీకి స‌మాచారం

భార‌త గ‌గ‌నత‌లంపై డ్రోన్లపై నిషేధం ఉన్నా య‌థేచ్ఛ‌గా విహ‌రిస్తున్నాయ‌న‌డానికి ప్ర‌త్య‌క్ష సాక్ష్యం ఇది. గో ఎయిర్‌కు చెందిన విమానం ఒక‌టి ముంబై విమానాశ్ర‌యంలో శ‌నివారం ఉద‌యం ల్యాండ్ అవుతున్న స‌మ‌యంలో 12 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న డ్రోన్‌ను పైల‌ట్ గుర్తించాడు. వెంట‌నే విష‌యాన్ని ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్‌(ఏటీసీ)కి స‌మాచారం అందించాడు. నాలుగు రోటర్ల‌తో ఉన్న తెల్ల‌రంగు  డ్రోన్‌ను విమానానికి రెండు కిలోమీట‌ర్ల దూరంలో గుర్తించిన‌ట్టు పైల‌ట్ తెలిపాడు. గ‌త రెండేళ్ల‌లో మూడు డ్రోన్లు ఇలా ఎగురుతుండ‌గా పైల‌ట్లు, గ్రౌండ్ సిబ్బంది గుర్తించారు. అయితే ఇంత ఎత్తులో ఎగురుతున్న డ్రోన్‌ను గుర్తించ‌డం మాత్రం ఇదే తొలిసారి.

నాలుగు రోట‌ర్ల‌తో భూమికి 12 వేల ఎత్తులో ఎగురుతున్న డ్రోన్‌ను చూసి పైల‌ట్ ఆశ్చ‌ర్య‌పోయినట్టు గో ఎయిర్ అధికార ప్ర‌తినిధి తెలిపారు. అయితే ఈ విష‌య‌మై ఇప్ప‌టి వ‌ర‌కు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌లేదు. ఈ ఘ‌ట‌న‌పై మాట్లాడేందుకు ముంబై ఏటీసీ అధికారులు అందుబాటులోకి రాలేదు. అయితే డ్రోన్ ఘ‌ట‌న‌పై దర్యాప్తు జ‌ర‌పాల‌ని కోరుతూ త‌మ‌కు స‌మాచారం అందిన‌ట్టు సీఐఎస్ఎఫ్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఓపీ సింగ్ తెలిపారు. డ్రోన్ల‌పై భార‌త్‌లో నిషేధం ఉన్నా అడ‌పాద‌డ‌పా క‌నిపిస్తున్న డ్రోన్లు భ‌ద్ర‌త‌ను ప్ర‌శ్నార్థకం చేస్తున్నాయి.

More Telugu News