venkaiah naidu: రేపటి నిరసనలకు ఎవరు వస్తారో.. ఎవరు నడిపిస్తారో అందరూ చూస్తారు: వెంకయ్యనాయుడు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదాను డిమాండ్ చేస్తూ రేపు విశాఖ‌పట్నంలోని ఆర్కే బీచ్‌లో రాష్ట్ర యువ‌త త‌ల‌బెట్టిన దీక్ష ప‌ట్ల కేంద్ర మంత్రి వెంక‌య్య నాయుడు స్పందించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరి వాదన వారు చెప్పుకునే హక్కు ఉందని అంటూనే రేపటి నిరసనలకు ఎవరు వస్తారో ఎవరు నడిపిస్తారో అందరూ చూస్తారని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రానికి కావాల్సిన నిధులు అందిస్తూనే ఉంద‌ని, తక్కువ సమయంలో ఎక్కువ నిధులు మంజూరయ్యాయని చెప్పారు. పెట్టుబడుల సదస్సు వల్ల ఉద్యోగాలు పెరుగుతాయని, ఆ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు వ్యవహరించాలని ఆయ‌న అన్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు జ‌రిగిన‌ అన్యాయాన్ని కేంద్ర స‌ర్కారు సరిచేస్తుందని, ఈ విష‌యాన్నే తాము పార్లమెంట్ బయట, లోపల ప్రస్తావిస్తున్నామ‌ని వెంకయ్య చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే అధిక‌మ‌వుతున్నాయ‌ని అన్నారు. స్వాతంత్ర్యం వ‌చ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్ర‌భుత్వం ఏ రాష్ట్రానికి ఇంత తక్కువ సమయంలో ఇన్ని ఎక్కువ ప్రాజెక్టులు, నిధులు మంజూరు చేయలేదని చెప్పారు.

More Telugu News