: ఓ వైపు మాజీ సీఎం కుమార్తె, మరోవైపు ప్రస్తుత సీఎం మరదలు... లక్నో కంటోన్మెంట్ లో 'మెగా యుద్ధం'!

ఓ వైపు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం హెచ్ ఎన్ బహుగుణ కుమార్తె రీటా బహుగుణ, మరోవైపు ప్రస్తుత సీఎం అఖిలేష్ యాదవ్ మరదలు అపర్ణా యాదవ్... త్వరలో ఎన్నికలు జరగనున్న యూపీలో అందరి కళ్లూ వీరిద్దరూ పోటీ పడతారని భావిస్తున్న లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గంపైనే వున్నాయి. ఈ స్థానానికి అపర్ణను ఖరారు చేస్తూ, అఖిలేష్ నిర్ణయం తీసుకోనప్పటికీ, దాదాపు ఏడాదిన్నర కిందటే, లక్నో కంటోన్మెంట్ నుంచి అపర్ణ పోటీ చేస్తారని ములాయం ప్రకటించారు. ఆనాటి నుంచి నియోజకవర్గంపై దృష్టి సారించిన అపర్ణ, పట్టును పెంచుకుంటూ రావడంతో, తండ్రి ఇచ్చిన మాటను ప్రస్తుతం అఖిలేష్ కాదనలేకపోవచ్చని తెలుస్తోంది.

ఇక కాంగ్రెస్ పార్టీకి షాకిస్తూ, ఇటీవల కాషాయ కండువా కప్పుకొన్న సీనియర్‌ నేతగా, రీటా బహుగుణ పేరును బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. ఈమెపై పోటీకి అపర్ణా యాదవ్ సిద్ధపడితే, మెగా యుద్ధం ఖాయమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకూ ఈ స్థానంలో సమాజ్ వాదీ గెలవలేదు. కాంగ్రెస్ కు కంచుకోటగా వస్తున్న లక్నో కంటోన్మెంట్ లో గత ఎన్నికల్లో రీటా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి 20 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పడిక ఆమె బీజేపీలో చేరడం, కాంగ్రెస్, సమాజ్ వాదీల మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో సంప్రదాయ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఈ నియోజకవర్గంలో కీలకంగా మారింది. దీంతో అఖిలేష్ నుంచి అపర్ణకు గ్రీన్ సిగ్నల్ వస్తే, అపర్ణ, రీటాల నడుమ హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.

More Telugu News