: తొలిసారిగా ప్రజల ముందుకు వచ్చి కనువిందు చేయనున్న గన్ సిస్టమ్ 'ధనుష్'!

పూర్తి భారత పరిజ్ఞానంతో తయారై 'స్వదేశీ బోఫోర్స్'గా పేరు తెచ్చుకున్న గన్ సిస్టమ్ 'ధనుష్' ఈ గణతంత్ర దినోత్సవం వేళ ప్రత్యేక ఆకర్షణ కానుంది. జబల్ పూర్ కేంద్రంగా పనిచేస్తున్న జీసీఎఫ్ (గన్ క్యారేజ్ ఫ్యాక్టరీ) వీటిని తయారు చేయగా, తొలిసారి రిపబ్లిక్ పరేడ్ లో ఇవి పాలు పంచుకోనున్నాయి. 155 ఎంఎం గన్ తో ఉండే ఒక్కో 'ధనుష్' ధర రూ. 14.50 కోట్ల రూపాయలని జీసీఎఫ్ జాయింట్ జనరల్ మేనేజర్ సంజయ్ శ్రీవాత్సవ వెల్లడించారు.

ఈ గన్ తో భారత రక్షణ శాఖ సామర్థ్యం మరింతగా పెరిగిందని, ఎన్నో దేశాలు వాడుతున్న వెపన్ సిస్టమ్స్ కు దీటుగా దీన్ని తయారు చేశామని తెలిపారు. బోఫోర్స్ గన్ లు పేలిస్తే, 11 కిలోమీటర్ల రేంజ్ వరకూ వెళ్లగలుగుతాయని, ధనుష్ 38 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలనూ చేరుతుందని తెలిపారు. 2012 సెప్టెంబర్ 22న 'ధనుష్' తయారీకి అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పచ్చజెండా ఊపగా, ఆనాటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ జీసీఎఫ్ కేంద్రంలో ధనుష్ తయారీ యూనిట్ ను ప్రారంభించారు. ఇప్పటివరకూ ఆరు 'ధనుష్'లు తయారయ్యాయి. మొత్తం 114 ధనుష్ గన్స్ తయారు చేయాలన్నది జీసీఎఫ్ లక్ష్యం.

More Telugu News