: ఆసుపత్రి నుంచే ఆందోళనకారులకు సందేశం ఇచ్చిన లారెన్స్

జల్లికట్టు కోసం తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. ఈ నేపథ్యంలో, ప్రముఖ సినీ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ ఆసుపత్రి నుంచే ఓ వీడియో సందేశాన్ని పంపించాడు. శాంతియుతంగానే ఆందోళన చేపట్టాలని తమిళ యువతను ఆయన వేడుకొన్నాడు. హింసాయుత ఆందోళన వైపు వెళ్లకూడదని విన్నవించాడు. మెడ నొప్పితో బాధ పడుతున్న రాఘవ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మెడనొప్పి తీవ్రంగా ఉన్నప్పటికీ... జల్లికట్టు కోసం పోరాడుతున్న యువతకు అండగా నిలిచాడు.

ఆందోళన చేస్తున్న యువతను కలవడానికి తాను మెరీనా బీచ్ వద్దకు వచ్చానని... అయితే, వారితో కలవకుండా పోలీసులు తనను అడ్డుకున్నారని లారెన్స్ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఆందోళన చేయడానికి రాలేదని... యువతకు సర్ది చెప్పేందుకు వచ్చానని... తనను వారిని కలిసేందుకు అనుమతించాలని కోరినా పోలీసులు వినలేదని చెప్పాడు. కాళ్లు పట్టుకుంటానని చెప్పినా వినకుండా, తనను తోసి వేశారని తెలిపాడు. పోలీసులు తోసేయడంతో, తన మెడ నొప్పి మరింత తీవ్రంగా మారిందని అన్నాడు. 

More Telugu News