: ఫ‌లితాలిస్తున్న చంద్ర‌బాబు దావోస్ ప‌ర్య‌ట‌న‌.. పెట్టుబ‌డుల‌కు ముందుకొస్తున్న ప‌లు కంపెనీలు

ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి దావోస్ ప‌ర్య‌ట‌న ఫ‌లితాలిస్తోంది. ప్ర‌పంచ ఆర్థిక వేదిక  సద‌స్సులో పాల్గొనేందుకు వెళ్లి చంద్ర‌బాబు అక్క‌డి నుంచి ఏపీకి పెట్టుబ‌డులు తెచ్చేందుకు చేస్తున్న కృషికి సానుకూల ఫ‌లితాలు వ‌స్తున్నాయి. సోమ‌వారం జ్యూరిచ్‌లో ప‌లు అంత‌ర్జాతీయ కంపెనీల ప్ర‌తినిధుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. విద్య‌, విద్యుత్‌, ఆరోగ్యం,  సైబ‌ర్ సెక్యూరిటీ, నైపుణ్యాభివృద్ధి త‌దిత‌ర రంగాల్లో పేరున్న సంస్థ‌ల‌ను ఏపీకి ఆహ్వానించారు.

జ‌ల‌విద్యుత్ కేంద్రాల‌కు సాంకేతిక‌త అందించేందుకు బీకేడ‌బ్ల్యూ ఎన‌ర్జీ ఏజీ అనే కంపెనీ ముందుకు వ‌చ్చింది. ఆ కంపెనీ ప్ర‌తినిధితో చంద్ర‌బాబు స‌మావేశ‌మై ప్ర‌తిష్ఠాత్మ‌క పోల‌వ‌రం ప్రాజెక్టులో నిర్మిస్తున్న 960 మెగావాట్ల జ‌ల‌విద్యుత్ కేంద్రంపై చ‌ర్చించారు. ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఇంధ‌న సంస్థ‌ల్లో ఒక‌టైన బీకేడ‌బ్ల్యూ ఎన‌ర్జీ ఏజీ స్విట్జ‌ర్లాండ్‌లో ప‌వ‌ర్ గ్రిడ్ ద్వారా ప‌దిల‌క్ష‌ల గృహాల‌కు నిరంతరం విద్యుత్ అందిస్తోంది.

అనంత‌రం చంద్ర‌బాబు యూరోపియ‌న్ ఎడ్యుకేష‌న్ అండ్‌ రీసెర్చ్ కౌన్సిల్ ప్ర‌తినిధుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. అలాగే ఈఈఏఆర్సీ వ్య‌వ‌స్థాప‌కుడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన రాజ్ వంగ‌పండుతో భేటీ అయ్యారు. ఆటోమొబైల్ క్ల‌స్ట‌ర్ల ఏర్పాట్లలో స‌హ‌కారం అందించేందుకు ఆయ‌న సంసిద్ధ‌త వ్య‌క్తం చేశారు. మార్చిలో ఏపీలో నిర్వ‌హించే ఏరోస్పేస్ స‌ద‌స్సుకు స్విట్జ‌ర్లాండ్‌లోని భార‌త రాయ‌బారి పురుషోత్తంను చంద్ర‌బాబు ఆహ్వానించారు.  ఏపీ ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌నిచేసేందుకు డ్యూర్ టెక్నాల‌జీస్‌, మొబినో స్విట్జ‌ర్లాండ్, ఎల‌క్ట్రో పెయింట్స్‌, ఘేర్జీ కార్పొరేష‌న్ త‌దిత‌ర సంస్థ‌లు ముందుకొచ్చాయి. ఘేర్జి కార్పొరేష‌న్ ఏపీలో రూ.2 వేల కోట్లు  పెట్టుబ‌డి పెట్టేందుకు ముందుకొచ్చింది. కడప జిల్లాకు చెందిన ప్ర‌వాసాంధ్రుడు రాట‌కొండ సుబ్ర‌హ్మ‌ణ్యం ఏపీలో 50 మెగావాట్ల విద్యుత్ కేంద్ర స్థాప‌న‌కు ఆస‌క్తి క‌న‌బ‌రిచారు.

More Telugu News