: పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఉన్నప్పటికీ.. ఆర్థికవృద్ధిలో చైనా కంటే శరవేగంగా దూసుకెళ్తున్న భారత్

దేశంలో పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో భార‌త ఆర్థికవ్యవస్థ కొంతమేర‌ మందగించింద‌ని విశ్లేష‌కులు చెబుతున్న విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ మ‌న ఆర్థిక వ్య‌వ‌స్థ పొరుగు దేశం చైనా కంటే మెరుగ్గానే ఉంద‌ట‌. దేశంలో పాత‌నోట్ల‌ను ర‌ద్దు చేసిన‌ప్ప‌టికీ చైనా కంటే భారత్ ఆర్థికవృద్ధి శరవేగంగా దూసుకెళుతోందని ప్రపంచ ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచ దిగ్గజ విశ్వవిద్యాల‌యాల ఆధ్వ‌ర్యంలో సింగ‌పూర్‌లో ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్లో మాజీ సింగపూర్ రాయబారి, భారత సంతతికి చెందిన ఓ విద్యావేత్త భార‌త్‌లో ఆర్థిక వృద్ధిపై మాట్లాడుతూ ఈ విష‌యాన్ని తెలిపారు.
సింగపూర్లోని నేషనల్ యూనివర్సిటీ పబ్లిక్ పాలసీ లీ కౌన్ యూ స్కూల్ డీన్ కిషోర్ మహబూబానీ కూడా ఈ అంశంపై స్పందిస్తూ... భార‌త‌ ఆర్థికవృద్ధిలో దీర్ఘకాలికంగా ఎలాంటి మార్పు ఉండదని చెప్పారు. అంతేగాక‌, మ‌న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ సంచ‌ల‌న నిర్ణ‌యం వ‌ల్ల మ‌న‌ ఎకానమీకి దీర్ఘకాలికంగా ఎన్నో ప్రయోజనాలున్నాయ‌ని పేర్కొన్నారు.

ఈ స‌మావేశంలో భౌగోళిక రాజకీయ ఆందోళనలు, సైబర్ అటాక్స్, ఉత్తరకొరియా క్షిపణి ఆవిష్కరణ, బ్రెగ్జిట్ వంటి పలు విషయాలపై చర్చించారు. అందులో భాగంగా భార‌త్‌లో తీసుకున్న పెద్ద‌నోట్ల ర‌ద్దు అంశాన్ని కూడా ప్ర‌స్తావించారు. స‌మాజంలో ఉన్న బ్లాక్‌మ‌నీ వెనక్కివచ్చేస్తుందని,ఈ అంశం భార‌త‌ ఆర్థికవ్యవస్థకు ఎంతో లాభాన్నిస్తుంద‌ని, ఇప్పుడు కూడా చైనా కంటే భారత ఆర్థికవృద్ధే శరవేగంగా ముందుకెళుతుంద‌ని ఆర్థిక విశ్లేష‌కులు స్ప‌ష్టం చేశారు. యునిపోలార్ వరల్డ్ నుంచి భార‌త్ ప్ర‌స్తుతం మ‌ల్టీ-పోలార్ వరల్డ్‌లోకి వెళుతోంద‌ని సింగపూర్లోని నేషనల్ యూనివర్సిటీ పబ్లిక్ పాలసీ లీ కౌన్ యూ స్కూల్ డీన్ కితాబు కూడా ఇచ్చారు. ఈ అంశం చిన్న దేశాలకు లాభం చేకూరుస్తుందని, మల్టీ-పోలార్ వరల్డ్ సింగపూర్కు మరిన్ని అవకాశాలు కల్పిస్తుందని అన్నారు. భార‌త్‌తో సింగ‌పూర్‌కి మంచి సంబంధాలున్నాయ‌ని, మ‌రోవైపు త‌మ దేశం అమెరికా, యూరప్ దేశాలతో మంచి సంబంధాలు కొన‌సాగిస్తుంద‌ని అన్నారు.

More Telugu News