: ఆ సంఘటన చూసి ఓంపురికి ఎంత కర్మ పట్టిందనుకున్నారట!

ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నటుడు ఓంపురి. 1992లో విడుదలైన ‘సిటీ ఆఫ్ జాయ్’ ఇంగ్లీషు సినిమా షూటింగ్ కోసం కోల్ కతాకు వెళ్లిన ఓంపురి, 'లాగుడు రిక్షా' నేర్చుకోవడం కోసం వారం రోజులపాటు కష్టపడ్డారట. ఈ నేపథ్యంలో జరిగిన ఒక సంఘటన గురించి ఓంపురి ఆత్మకథలో ఆయన భార్య నందితా పురి రాశారు.

‘మొఖం నిండా మచ్చలు, గంభీరమైన కంఠం, చెమట కారుతున్న అంగీ తొడుక్కుని లాగుడు రిక్షాను లాగుతున్న ఆ వ్యక్తి అక్కడ ఆగాడు. ఆ పక్కనే ఉన్న ఒక బండి వద్దకు టీ తాగేందుకు వెళ్లాడు. టీ తాగుతున్న వ్యక్తి గురించి, అక్కడే ఉన్న ఇద్దరు మిత్రులు మాట్లాడుకుంటూ, ‘అచ్చం ఓం పురిలా ఉన్నాడు కదా!’ అని వారిలో ఒకరు అనగా, ‘అవును, కొంచెం అలాగే కనిపిస్తున్నాడు. కానీ, ఓంపురి ఇక్కడికి ఎందుకు వస్తాడు? ఒకవేళ వచ్చినా, రోడ్డు పక్కన మనలా టీ ఎందుకు తాగుతాడు, లాగుడు రిక్షా ఎందుకు లాగుతాడు?’ అని మరో మిత్రుడు అన్నాడు.

ఆ మాటలను వింటున్న లాగుడు రిక్షా కార్మికుడు.. ‘అవును.. నేను ఓంపురినే’ అన్నాడు. అయితే, ఈ విషయాన్ని నమ్మలేకపోయిన ఆ ఇద్దరు మిత్రులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ‘సినిమాల్లో, టీవీ సీరియళ్లలో నటించిన ఓంపురి ఇప్పుడు, కోల్ కతాలో లాడుగు రిక్షా లాగుతున్నాడు!.. ఎంతటి కర్మ!’ అని టీ కొట్టు వ్యక్తి అక్కడ ఛాయ్ తాగుతున్న వారితో అనడం విన్న ఓంపురి తనలో తాను నవ్వుకుంటూ, లాగుడు రిక్షాను లాక్కుంటూ వెళ్లిపోయాడు’ అని ఆ ఆత్మకథలో పేర్కొన్నారు. 

More Telugu News