: ధోనీ ఆ పని చేసినట్లయితే వాళ్ల ఇంటి ముందు ధర్నా కు దిగేవాడిని: గవాస్కర్

టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ ధోనీ వన్డే, ట్వంటీ-20ల కెప్టెన్సీ బాధ్యతలకు గుడ్ బై చెబుతూ నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన వెలువడ్డ అనంతరం టీమిండియా, విదేశీ క్రికెటర్లు, కోచ్ లతో పాటు బాలీవుడ్ ప్రముఖులు కూడా స్పందించారు. తాజాగా, క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోనీ తప్పుకోవడం కొంత మేరకు సంతోషమేనని, అయితే, ఇంత త్వరగా ఈ నిర్ణయం తీసుకుంటాడని తాను ఊహించలేదని అన్నారు. కెప్టెన్సీ బాధ్యతలను ధోనీ వదులుకోవడంతో తానేమీ విస్మయం చెందలేదన్నారు.

అయితే, పూర్తిగా క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు కనుక ధోనీ ప్రకటించి ఉంటే, వాళ్ల ఇంటి ముందు ధర్నాకు దిగే వాళ్లలో తానే మొదటివాడిని అయ్యేవాడినని గవాస్కర్ చమత్కరించారు. భారత క్రికెట్ కు ధోనీ ఇంకా తన సేవలను అందించగలడని, బ్యాట్స్ మన్ గా అతడొక విధ్వంసకుడని అన్నారు. కెప్టెన్సీ బాధ్యతలను పక్కన పెట్టిన ధోనీ, బ్యాటింగ్, కీపింగ్ లో మరింత రాణించగలడని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భారతజట్టు భవిష్యత్తు దృష్ట్యానే ఇంగ్లాండ్ తో టీ 20, వన్డే సిరీస్ కు ముందు ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకున్నాడని అభిప్రాయపడ్డ గవాస్కర్, ధోనీని నాల్గు లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్ కు దించొచ్చని అన్నారు.

More Telugu News