high court: తెలంగాణ సర్కారుకి షాక్.. జీవో నెం.123 ద్వారా భూములు తీసుకోవ‌ద్ద‌ని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు!

తెలంగాణ ప్ర‌భుత్వానికి హైకోర్టులో షాక్ త‌గిలింది. జీవో నెంబ‌రు.123 ద్వారా భూములు తీసుకోవ‌ద్ద‌ని స‌ర్కారుకి స్ప‌ష్ట‌మైన‌ ఆదేశాలిస్తూ హైకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. వివిధ సాగునీటి ప‌థ‌కాల కోసం ప‌లు జిల్లాల్లో తెలంగాణ ప్ర‌భుత్వం 2013 భూసేక‌ర‌ణ ప‌ద్ధ‌తిలో కాకుండా జీవో నెంబ‌రు 123ను తీసుకొచ్చి దాని ద్వారానే భూముల‌ను సేక‌రించిన విష‌యం తెలిసిందే. దీని ప‌ట్ల తీవ్ర అభ్యంతరాలు వ్య‌క్తం చేస్తూ వంద‌ల మంది రైతులు హైకోర్టును ఆశ్ర‌యించారు. కొన్ని నెల‌లుగా ఈ కేసులో వాద‌న‌లు కొన‌సాగుతున్నాయి. అధికారులు బ‌ల‌వంతంగా భూములు లాక్కుంటున్నార‌ని రైతుల త‌ర‌ఫు న్యాయ‌వాదులు కోర్టులో వాదించిన‌ట్లు తెలుస్తోంది. ఇరు వ‌ర్గాల వాద‌న‌లు విన్న హైకోర్టు పై విధంగా ఆదేశాలు జారీ చేస్తూ 2013 భూసేక‌ర‌ణ ప‌ద్ధ‌తిలో భూమి సేక‌రిస్తే ఎటువంటి అభ్యంత‌రాలు ఉండ‌బోవ‌ని తెలిపింది. ఈ కేసులో ఇంకా వాద‌న‌లు కొన‌సాగుతున్నాయి.

More Telugu News