: 'పండుగ' చేసుకున్న మందుబాబులు.. తెలంగాణలో ఒక్క రోజే రూ.74 కోట్ల అమ్మ‌కాలు!

నోట్ల ర‌ద్దు ప్ర‌భావం మందు బాబుల‌పై ఏమాత్రం ప‌డ‌లేదు. న్యూ ఇయ‌ర్‌ను ఆహ్వానిస్తూ, పాత ఏడాదికి బైబై చెబుతూ మందుబాబులు 'పండుగ' చేసుకున్నారు. ఓ వైపు నోట్ల రద్దుతో ప్ర‌జ‌లు అవ‌స్థ‌లు ప‌డుతుంటే త‌మ‌కు మాత్రం అటువంటి ఇబ్బందులు ఏమీ లేవ‌ని నిరూపించారు. గ‌తేడాదితో స‌మానంగా మ‌ద్యం అమ్మ‌కాలు జ‌ర‌గ‌డం ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. డిసెంబ‌రు 31 అర్థరాత్రి ఏ వైన్ షాప్ వ‌ద్ద చూసినా చాంతాడంత క్యూలు క‌నిపించాయి. ముఖ్యంగా స్వైపింగ్ మిష‌న్లు ఉన్న మ‌ద్యం దుకాణాల్లో అమ్మ‌కాలు విప‌రీతంగా జ‌రిగిన‌ట్టు ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. నోట్లు ర‌ద్దు కాకుంటే అమ్మ‌కాలు మ‌రింత పెరిగి ఉండేవ‌ని అధికారులు తెలిపారు.

నిజానికి గ‌తేడాది కూడా డిసెంబ‌రు 31న తెలంగాణ రాష్ట్రంలో 74 కోట్ల విక్ర‌యాలే జ‌రిగాయి. అయితే ఇప్ప‌టి ప‌రిస్థితి వేరు. పెద్ద నోట్ల ర‌ద్దుతో విక్ర‌యాలు బాగా త‌గ్గాయి. న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్లోనూ నోట్ల ర‌ద్దు ప్ర‌భావం క‌నిపిస్తుంద‌ని భావించారు. అయితే అధికారుల అంచ‌నాల‌ను ప‌టాపంచ‌లు చేస్తూ మందుబాబులు పండుగ చేసుకున్నారు. రాష్ట్రంలో 2,144 మ‌ద్యం షాపులు, 853 బార్లు, 27 క్ల‌బ్బులు ఉన్నాయి. కాగా మొత్తం మీద చూస్తే ఈసారి బీర్ల అమ్మ‌కాలు 20 శాతం మేర ప‌డిపోయాయి. ఇక ఏపీలోనూ మద్యం ప్రియులు ఇదే జోరు కొన‌సాగించారు. డిసెంబ‌రు నెల చివ‌రి రెండు రోజుల్లో ఏకంగా రూ.120 కోట్ల మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రిగాయి. గ‌తేడాది ఇదే రోజుల్లో రూ.100 కోట్ల అమ్మ‌కాలు మాత్ర‌మే జ‌రిగిన‌ట్టు అధికారులు తెలిపారు.

More Telugu News