: 2017లో బంగారానికి గణనీయంగా తగ్గనున్న డిమాండ్!

నవంబర్ 8న మోదీ సర్కారు తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో 2017లో మూడింట ఒక వంతు మేరకు బంగారానికి డిమాండ్ తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సంవత్సరంలో కనీసం 300 టన్నుల వరకూ బంగారం అమ్మకాలు తగ్గుతాయని బులియన్ నిపుణులు భావిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా నెలకు సరాసరిన 65 నుంచి 70 టన్నుల మేరకు బంగారం దిగుమతులు నమోదవుతూ రాగా, నవంబర్ నుంచి పరిస్థితి మారింది. పండగల సీజన్, వివాహాది శుభకార్యాలూ కొనసాగుతున్నప్పటికీ, అమ్మకాలు సంతృప్తికరంగా నమోదు కాలేదని థామ్సన్ రాయిటర్స్ విశ్లేషకుడు సుదీశ్ నంబయత్ వ్యాఖ్యానించారు. నగదు చెల్లించి బంగారం కొనడం ఇకపై తగ్గుతుందని, తమ అంచనాల ప్రకారం 300 టన్నుల వరకూ అమ్మకాలు తగ్గుతాయని తెలిపారు.

గడచిన ఏడు సంవత్సరాలుగా సాలీనా 875 టన్నుల బంగారం అమ్మకాలు ఇండియాలో సాగుతుండగా, అందులో 85 నుంచి 90 శాతం వరకూ దిగుమతి అవుతున్నదే. మరో 20 శాతం వరకూ బంగారం అక్రమంగా ఇండియాకు వస్తుందని అంచనా. జీఎఫ్ఎంఎస్ అంచనాల మేరకు 2015లో 187 టన్నులు, 2015లో 142 టన్నుల బంగారం ఇండియాకు స్మగుల్ అయింది. ఇక డిమాండ్ తగ్గుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుండగా, అక్రమంగా దేశానికి వచ్చే బంగారం కూడా తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇండియాకు స్మగ్లింగ్ మార్గంలో వచ్చే బంగారాన్ని ఆభరణాల వ్యాపారులు బిల్లులు ఇవ్వకుండా విక్రయాలు సాగిస్తుంటారన్న సంగతి తెలిసిందే. నల్లధనం ప్రజల వద్ద గణనీయంగా తగ్గిన ఈ పరిస్థితుల్లో దాని ప్రభావం బంగారం విక్రయాలపై ఈ సంవత్సరం కనిపించనుంది.

More Telugu News