: అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి... కొత్త నోట్లు అంతసేపు ముద్రించలేం!: కరెన్సీ నోట్ల ముద్రణాలయం ఉద్యోగులు

గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని సల్బోనీలో కరెన్సీ నోట్ల ముద్రణాలయం సిబ్బంది ఇకపై తాము 12 గంటలు పనిచేయలేమని చేతులెత్తేశారు. ఈ నెల 14న యాజమాన్యంతో రోజుకు 12 గంటల షిఫ్ట్ లో పనిచేసేందుకు ఒప్పందం కుదిరిందని ఆర్బీఐ నోట్ ముద్రణా ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగుల సంఘం నేత తెలిపారు. ఈ ఒప్పందం ఈ నెల 27తో ముగిసిందని ఆయన చెప్పారు. సాధారణంగా తాము 9 గంటలపాటు పని చేస్తామని, ప్రజల అసౌకర్యం, ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో గత 15 రోజులుగా రోజుకు 12 గంటలపాటు పని చేస్తున్నామని అన్నారు.

దీంతో కొంత మంది ఉద్యోగులు అనారోగ్యం బారినపడ్డారని, నడుము నొప్పి, నిద్రపట్టకపోవడం, శారీరక, మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నామని ఫిర్యాదులందుతున్నాయని ఆయన తెలిపారు. దీంతో యాజమాన్యం ఒప్పందాన్ని పొడిగించాలని కోరగా తాము అంగీకరించలేదని ఆయన పేర్కొన్నారు. మూడు షిఫ్టుల్లో రోజుకు పన్నెండు గంటల షిఫ్ట్‌ లో రోజూ సుమారు 4.6 కోట్ల నోట్లను ముద్రించేవారమని చెప్పారు. తాజా నిర్ణయంతో రోజూ ముద్రించే కరెన్సీలో 60 లక్షల నోట్లు తగ్గుతాయని ఆయన వెల్లడించారు. 

More Telugu News