: విమానాశ్రయ ఉద్యోగులకు ఇచ్చే 'ఏఈపీ'లకు తప్పనిసరి కానున్న ‘ఆధార్’

భద్రతా కారణాల దృష్ట్యా దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో పని చేసే ఉద్యోగులకు ఇచ్చే ఎయిర్ పోర్ట్ ఎంట్రీ పాస్ (ఏఈపీ)కు ఇకపై ఆధార్ కార్డు నంబరు తప్పనిసరి కానుంది. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) ప్రతిపాదన మేరకు ఏఈపీకు ‘ఆధార్’ నంబర్ ను అనుసంధానం చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. విమానాశ్రయాల్లోకి ప్రవేశించేటప్పుడు, తిరిగి బయటకు వచ్చేటప్పుడు ‘ఆధార్’ అనుసంధాన ఏఈపీలు ఉండాలని, జనవరి 1 నుంచి ఈ పద్ధతి అమల్లో ఉండాలని ఈ మేరకు  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ, విమానాశ్రయ ఉద్యోగి ఎటువంటి నేరపూరిత  కార్యకలాపాల్లోనైనా ఉన్నారని తెలిస్తే, తక్షణం వారి పాస్ లను సస్పెండ్ చేయడమో, బ్లాక్ చేయడమో చేస్తామని అన్నారు. కొత్తగా ప్రవేశపెట్టనున్న ఈ పద్ధతి వల్ల చాలా ప్రయోజనాలున్నాయని, సంబంధం లేని వ్యక్తులు విమానాశ్రయాల్లోకి ప్రవేశించడం కుదరదన్నారు. సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ మాట్లాడుతూ, గతంలో ఇచ్చిన పాస్ ల గడువు మార్చి 31తో ముగియనున్నట్లు చెప్పారు.

More Telugu News