: సీఎంగా శ‌శిక‌ళ‌.. 29న పార్టీ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా ఎంపిక‌?

అన్నాడీఎంకే పార్టీలో వేగంగా మారుతున్న  పరిణామాల‌ను చూస్తుంటే దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత నెచ్చెలి శ‌శిక‌ళ ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిష్టించ‌డం ఖాయ‌మేన‌ని అనిపిస్తోంది. పార్టీ ప‌గ్గాల‌ను శ‌శిక‌ళ‌ స్వీక‌రించ‌డం దాదాపు ఖాయ‌మైన నేప‌థ్యంలో సీఎంగానూ ఆమె త్వ‌ర‌లోనే ప్ర‌మాణ స్వీకారం చేసే అవ‌కాశాలున్నాయ‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈనెల 29న చెన్నైలోని శ్రీవారి క‌ల్యాణ మండ‌పంలో అన్నాడీఎంకే స‌ర్వ‌స‌భ్య మండ‌లి, కార్యాచ‌ర‌ణ మండ‌లి స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్నారు.

ఈ  సంద‌ర్భంగా పార్టీ ప‌ద‌వికి  పోటీ చేసే అభ్య‌ర్థి ఐదేళ్ల‌పాటు పార్టీ స‌భ్య‌త్వం క‌లిగి ఉండాల‌న్న నిబంధ‌న‌ను పార్టీ స‌ర్వ‌స‌భ్య మండ‌లి స‌మావేశంలో స‌డ‌లించ‌నున్నారు. ఈ విష‌యాన్ని పార్టీ ప్రిసీడియం చైర్మ‌న్ మ‌ధుసూద‌న్ గ‌తంలోనే పేర్కొన్నారు. నిబంధ‌న స‌డ‌లించిన వెంట‌నే పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఆమెను ఏక‌గ్రీవంగా ఎన్నుకుంటారు.  అనంత‌రం పార్టీ  శాస‌న‌స‌భ్యుల స‌మావేశం నిర్వ‌హించి శ‌శిక‌ళ‌ను స‌భాప‌క్ష నాయ‌కురాలిగా ఎన్నుకునే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం. ఢిల్లీ ప‌ర్య‌ట‌న అనంత‌రం వారం రోజుల‌పాటు శ‌శిక‌ళ‌ను కలుసుకోని ముఖ్య‌మంత్రి  ప‌న్నీర్‌సెల్వం సోమ‌వారం సాయంత్రం పోయెస్ గార్డెన్‌కు వెళ్లి ప‌ది నిమిషాలు భేటీ అయ్యారు. వారి స‌మావేశంలో ఇదే విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

More Telugu News