: 15 ఎస్బీఐ అకౌంట్లలో 1,300 కోట్ల నల్లధనం జమ!

పెద్ద నోట్ల రద్దు తరువాత యాక్సీస్ బ్యాంకు అకౌంట్లలో పెద్దఎత్తున నల్లధనం డిపాజిట్ అయిందని వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌ లో మరికొన్ని వాస్తవాలు వెలుగుచూశాయి. అక్కడి 15 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అకౌంట్లలో అక్షరాలా రూ.1,300 కోట్లకు పైగా డిపాజిట్ కావడం కలకలం రేపుతోంది. దీనిని నల్లధనంగా అనుమానిస్తుండగా, ఈ అకౌంట్ల వివరాలు వెల్లడించేందుకు ఎస్బీఐ అధికారులు ససేమిరా అంటున్నారు. నోట్ల రద్దు అనంతరం రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 800 కోట్ల రూపాయలు డిపాజిట్ కాగా, ఇటానగర్‌ లోని ఒక ఎస్బీఐ శాఖలోని 15 అకౌంట్లలో 1,300 కోట్ల రూపాయలు డిపాజిట్టయినట్టు లోకల్ డెయిలీ ఒక వార్తాను ప్రచురించింది.

ఎస్బీఐ అధికారులిచ్చిన సమాచారం ఆధారంగానే సదరు కథనం రాసినట్టు ఆ వార్తాపత్రిక తెలిపింది. కాగా, ఇదే రాష్ట్రంలోని నహర్‌ లగూన్‌ లోని హెచ్డీఎఫ్సీ బ్రాంచ్ మేనేజర్ రీతూపర్ణ గోహైన్ ఈ మధ్యే అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నారని కూడా ఆ కథనంలో పేర్కొన్నారు. అయితే నోట్ల రద్దు అనంతరం అరుణాచల్ ప్రదేశ్ లో పెద్దఎత్తున బ్యాంకు ఖాతాలు ఓపెన్ కావడంతో పాటు, అసోంకు చెందిన పలువురు రాజకీయనాయకులు తమ నల్లధనాన్ని అరుణాచల్ ప్రదేశ్ కు తరలించి పెద్ద ఎత్తున జమ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిపై విచారణ జరగాల్సి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News