: అమెరికా కెనడాలకు రూ. 25 వేలకే ప్రయాణం... జోరు పెంచిన చైనా విమానాలు!

ఢిల్లీకి చెందిన మహిళా వ్యాపారవేత్త అషిమా జైన్ గత వేసవిలో లాస్ ఏంజిల్స్ వెళ్లాలని భావించారు. భారత విమానయాన సంస్థల్లో ఒకవైపు ప్రయాణ ధర రూ. 65 వేల నుంచి ప్రారంభం కాగా, సౌత్ చైనా ఎయిర్ లైన్స్ ఆమెకు రానూ పోనూ ప్రయాణాన్ని రూ. 58 వేలకే అందించింది. అషిమా ఒక్కరే కాదు. యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాలని భావించేవారు ఎందరో ఇప్పుడు చైనా విమానయాన సంస్థలను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం ఇండియా నుంచి 42 సర్వీసులను చైనా ఎయిర్ లైన్స్ నిర్వహిస్తుండగా, వాటిల్లో 10 వేల వరకూ సీట్లు లభిస్తున్నాయి.

"గత కొంత కాలంగా చైనా సంస్థలను ఆశ్రయిస్తున్న భారత ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది" అని థామస్ కుక్ ఇండియా, గ్లోబల్ బిజినెస్ ట్రావెల్ విభాగం ప్రెసిడెంట్ ఇందీవర్ రస్తోగీ వెల్లడించారు. హై క్వాలిటీ సేవలతో పాటు, తక్కువ ధరలకు ప్రయాణాన్ని ఆఫర్ చేస్తున్నందునే కార్పొరేట్ ట్రావెలర్ల నుంచి పలు వర్గాల ప్రయాణికులు చైనా సంస్థలను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. ఇక్కడి నుంచి సర్వీస్ లభించకుంటే, చైనాలోని ఓ నగరానికి చేరుకుని అక్కడి నుంచి తమ గమ్యస్థానానికి వెళ్లాలని భావిస్తున్న వారి సంఖ్యా పెరుగుతోందని వెల్లడించారు.

సింగపూర్ ఎయిర్ లైన్స్, థాయ్ ఎయిర్ వేస్, మలేషియా ఎయిర్ లైన్స్ లతో పోలిస్తే, చైనా విమానాల్లో రూ. 20 వేల నుంచి రూ. 25 వేల తక్కువకు టికెట్లు లభిస్తున్నాయని రస్తోగీ వెల్లడించారు. కాగా, చైనా, ఇండియా మధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాల మేరకు ఇరు వైపులా 42 సర్వీసులు తిరిగేందుకే వీలుంది. చైనా సంస్థల విమానాలు పూర్తి ప్రయాణికులతో తిరుగుతుంటే, ఎయిర్ ఇండియా నడుపుతున్న 5 విమానాల్లో కేవలం 1,280 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరే ఇతర భారత సంస్థా చైనాకు విమానాలు నడపడం లేదని ఓ సీనియర్ ప్రభుత్వాధికారి గుర్తు చేశారు.

ఇండియా నుంచి విదేశాలకు వెళ్లాలని చూస్తున్న వారిని ఆకర్షిస్తున్న చైనా సంస్థలు, వారిని చైనాలోని తమ గమ్య స్థానాలకు తీసుకెళ్లి, అక్కడి నుంచి ప్రయాణికుల గమ్యస్థానానికి చేరుస్తున్నాయి. ఎయిర్ ఇండియా ధరలతో పోలిస్తే 40 నుంచి 50 శాతం వరకూ తక్కువకే తమ అవసరాలు తీరుతుండటంతోనే, చైనా కంపెనీలకు ఆదరణ అధికంగా ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

More Telugu News