: న్యూఇయర్ వేడుకలను నిషేధించిన బంగ్లాదేశ్

నూతన సంవత్సర వేడుకలను బంగ్లాదేశ్ నిషేధించింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున వేడుకలు జరుగుతాయన్న సంగతి అందరికీ తెలిసిందే. పాశ్చాత్య దేశాల్లో న్యూఇయర్ ను అద్భుతరీతిలో సెలబ్రేట్ చేసుకుంటారు. భారత్ లో ఈవెంట్స్ తో రిసార్టులు, స్టార్ హోటళ్లు, పర్యాటక ప్రాంతాలు గానాబజానా, మందు, విందు, చిందుతో హోరెత్తిపోతాయి. నిన్నమొన్నటి వరకు బంగ్లాదేశ్ లో కూడా ఇలానే న్యూఇయర్ వేడుకలు జరిగేవి. అయితే ఈ ఏడాది ఇలాంటి వేడుకలను నిషేధిస్తూ బంగ్లా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఆ దేశ హోం శాఖామంత్రి అసదుజ్జమన్ ఖాన్ కమాల్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు గుంపులు గుంపులుగా కలుసుకోవడం, బహిరంగ ప్రదర్శనలు ఇవ్వడం, సంబరాలు చేసుకోవడాన్ని నిషేధిస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

 ఇంకా ఎవరైనా ఇంట్లో వేడుక నిర్వహించుకోవాలనుకుంటే స్థానిక పోలీసుల అనుమతి తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. సాయంత్రం ఆరు తరువాత క్లబ్బులు, పబ్బులు మూసేయాలని, ఎటువంటి బాణాసంచా కాల్చరాదని ఆయన తెలిపారు. న్యూఇయర్ రోజును పురస్కరించుకుని యువత చట్టాలను అతిక్రమంచి చేయరాని పనులు చేస్తున్నారని, వాటిని నిరోధించేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఆ రోజు బంగ్లాదేశ్ లోని ప్రధాన పట్టణాల్లో గస్తీ పెంచుతామని ఆయన తెలిపారు. దీనిపై నెటిజన్లు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

More Telugu News