: బాంబు పేల్చిన సుబ్రహ్మణ్యస్వామి.. నోట్ల రద్దు ముందుగానే లీకైందని ఆరోపణ

సంచలన ప్రకటనలతో దేశం దృష్టిని ఆకర్షించే బీజేపీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి మరోమారు బాంబు పేల్చారు. నోట్ల రద్దు విషయం ముందుగానే లీకైందని అన్నారు. సోమవారం కోయంబత్తూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీపైనా, కేంద్రంపైనా మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయిందని, నోట్లు రద్దు చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సిందని అన్నారు.

నోట్ల రద్దు ప్రకటనకు ముందు ఏటీఎంలను విస్తృతంగా ఏర్పాటు చేయాలని, పన్నులను తగ్గించాలని కేంద్రానికి తాను సూచించినట్టు తెలిపారు. అయితే తాను చేసిన సూచనలను ఆర్థికమంత్రి జైట్లీ పక్కనపెట్టారని విమర్శించారు. ప్రస్తుత నోట్ల కష్టాలకు ఆయనే కారణమని అన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ముందుగానే లీకైందని, అయితే ఈ విషయంలో కేసులు వేసే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని అధికార పార్టీ ఎంపీనే తూర్పారబట్టడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

More Telugu News