jagan: చంద్ర‌బాబు మ‌న‌ల్నే రివ‌ర్స్ ప్ర‌శ్నిస్తున్నారు.. మ‌న క‌ర్మ‌!: వైఎస్ జ‌గ‌న్

ప్ర‌త్యేక హోదాపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి రాక‌ముందు ఒక‌లా మాట్లాడి ఇప్పుడు మ‌రోలా మాట్లాడుతున్నార‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ రోజు విజ‌య న‌గ‌రంలో నిర్వ‌హిస్తోన్న యువ‌భేరిలో ఆయ‌న మాట్లాడుతూ... ప్ర‌త్యేక హోదా సాధించాల్సిన వ్య‌క్తే దాని వ‌ల్ల పరిశ్ర‌మ‌లు వ‌స్తాయా? అంటూ రివ‌ర్స్ మ‌న‌ల్నే ప్రశ్నిస్తున్నారని చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇటువంటి ముఖ్య‌మంత్రి మ‌న రాష్ట్రంలో ఉండ‌డం మ‌న క‌ర్మ అని ఆయ‌న అన్నారు. స్వ‌ప్ర‌యోజ‌నాల‌ కోస‌మే టీడీపీ నేత‌లు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టు పెడుతున్నార‌ని ఆయ‌న అన్నారు.

రుణ‌మాఫీ చేస్తాన‌న్న హామీని కూడా చంద్ర‌బాబు మ‌రిచిపోయార‌ని జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేల‌ను కొంటూ డ‌బ్బు మారుస్తూ టీడీపీ నేత‌లు అడ్డంగా దొరికి పోయార‌ని ఆయ‌న అన్నారు. న‌ల్ల‌ధ‌నం ఇస్తూ దొరికిపోయినప్ప‌టికీ చంద్ర‌బాబు సీఎం ప‌దవిలో కొన‌సాగుతున్నార‌ని అన్నారు. ప్ర‌త్యేక హోదా అంశాన్ని విస్మ‌రిస్తే నేటి యువ‌త‌కు ఉద్యోగాలు ఎలా వ‌స్తాయ‌ని ఆయ‌న ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. హోదా వ‌స్తేనే రాష్ట్రంలో పెట్టుబ‌డులు  పెరిగి ఉద్యోగాలు వ‌స్తాయ‌ని చెప్పారు. ప్ర‌త్యేక హోదా గురించి కేంద్ర ప్ర‌భుత్వాన్ని అడిగితే, అరెస్టు చేస్తార‌ని చంద్ర‌బాబు నాయుడికి భ‌యం ప‌ట్టుకుంద‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. మూడేళ్ల‌లో టీడీపీ నేత‌లు అవినీతిని పెంచి పోషించార‌ని అన్నారు.

More Telugu News