: నయీమ్ వద్ద దొరికిన ఆ వజ్రాలు, వైఢూర్యాలు ఎక్కడ?: అసెంబ్లీలో కేసీఆర్ ను ప్రశ్నించిన జీవన్ రెడ్డి

గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎన్ కౌంటర్ పై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడిగా చర్చ సాగుతోంది. గత ప్రభుత్వాల వైఫల్యం కారణంగానే నయీమ్ ఎదిగాడని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తప్పుబట్టారు. నయీమ్ ఎన్ కౌంటర్ అనంతరం అతడి స్థావరాల నుంచి వందలు, వేల కోట్ల విలువైన సంపదను పోలీసులు పట్టుకున్నట్టు వార్తలు వచ్చాయని, ఆ సంపదను టీఆర్ఎస్ నేతలు పంచుకున్నారని ఆరోపించారు.

నయీమ్ భవనాలు, అతని అనుచరుల నుంచి ఎంతో విలువైన వజ్రాలు, వైఢూర్యాలు, కిలోల కొద్దీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయని, వేలాది ఎకరాల భూములకు చెందిన డాక్యుమెంట్లు సైతం పట్టుబడ్డట్టు తెలుస్తోందని చెప్పిన జీవన్ రెడ్డి, వీటన్నింటినీ టీఆర్ఎస్ ప్రభుత్వం స్వాహా చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నయీమ్ నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తం సంపద వివరాలను సభ ముందుంచాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. నయీమ్ డైరీ రాసేవాడని వార్తలు వచ్చాయని, దాన్ని బయటపెట్టాలని కేసీఆర్ ను అడిగారు. అతని ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్ లు, సీసీ కెమెరాల ఫుటేజ్ లను బహిర్గతం చేయాలని, అప్పుడే అసలు వాస్తవాలు, టీఆర్ఎస్ నేతలకు నయీమ్ తో ఉన్న బంధాలు తెలుస్తాయని అన్నారు.

More Telugu News