supreme court: జాతీయ గీతం ఆలపిస్తుండగా సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ కెమెరాకు చిక్కిన మహిళా ఎమ్మెల్యే

ఓ వైపు అందరూ ఎంతో గర్వంగా జాతీయ గీతం ఆలపిస్తుండగా మరోవైపు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ కెమెరాకు చిక్కారు ఓ మహిళా ఎమ్మెల్యే. ప‌శ్చిమ‌బెంగాల్‌లోని అధికార‌ పార్టీ టీఎంసీ ఎమ్మెల్యే వైశాలి దాల్మియా ఆ రాష్ట్రంలోని హౌరాలో జరిగిన ఒక క్రీడా కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఈ కార్య‌క్ర‌మంలో జాతీయ గీతం ఆలపిస్తున్నారు. అయితే, ఓ వైపు పోలీసులు, అధికారులు, యువ‌కులు  అంతాక‌లిసి గుండెల మీద చేతులు పెట్టుకుని జ‌న‌గ‌ణ‌మ‌న పాడుతుండ‌గా స‌ద‌రు ఎమ్మెల్యే మాత్రం సెల్‌ఫోన్‌లో మాట్లాడారు. అంతలో కెమెరాలు అన్నీ ఆమెవైపే తిరిగాయి. దీన్ని గ‌మ‌నించిన వైశాలి వెంటనే కాల్ కట్ చేశారు.

జాతీయ గీతం గౌరవానికి భంగం కలిగించడాన్ని నిరోధించే చట్టంలోని మూడో సెక్షన్ ప్రకారం సదరు ఎమ్మెల్యే చేసిన ఈ చ‌ర్య‌కు గానూ ఆమెపై చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంది. భార‌త‌ జాతీయ గీతం వస్తున్నప్పుడు దానికి అంత‌రాయం క‌లిగించేలా ఎవరైనా ఇలా ప్రవర్తిస్తే వారికి మూడేళ్ల వరకు జైలుశిక్షతో పాటు జ‌రిమానా కూడా విధించ‌వ‌చ్చు. ఇటీవ‌లే సుప్రీంకోర్టు సినిమా ప్రదర్శనకు ముందు థియేటర్లలో జ‌న‌గ‌ణ‌మ‌న పాడాల‌ని ఆదేశించింది. అయితే, కేరళలో ఓ సినిమా థియేట‌ర్‌లో జాతీయ‌గీతం వ‌స్తున్న‌ప్పుడు నిల‌బ‌డ‌నందుకు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ కేరళకు చెందిన 12 మందిని ఇటీవ‌లే అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News