: ప్రభుత్వాల పరిస్థితులు చక్కబడేవరకు భారత్-పాక్ మధ్య మ్యాచ్ లు జరగవు: ఇంజమామ్

భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరగాలని రెండు దేశాల ప్రజలు కోరుకుంటున్నారని పాకిస్థాన్ చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్-ఉల్-హక్ తెలిపాడు. జియో స్పోర్ట్స్ చానెల్ తో ఇంజమామ్ మాట్లాడుతూ, ప్రభుత్వాల మధ్య పరిస్థితులు చక్కబడేవరకు రెండు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ లు జరగడం అసాధ్యమని అన్నాడు. అయితే ద్వైపాక్షిక మ్యాచ్ లు జరగకపోవడం ఇరు దేశాలకు మంచిది కాదని చెప్పాడు. పాకిస్థాన్ కోణంలో చూస్తే మాత్రం ఇప్పటికే చాలా నష్టం కలిగిందని ఇంజమామ్ తెలిపాడు.

ఇతర దేశాల ఆటగాళ్లు కూడా పాకిస్థాన్ లో మ్యాచ్ లు ఆడేందుకు రావడం లేదని పేర్కొన్నాడు. పాక్ ఆటగాళ్లు సీనియర్ జట్టులో స్థానం పొందడానికి ముందు అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడలేకపోతున్నారని ఇంజమామ్ ఆవేదన వ్యక్తం చేశాడు. వ్యక్తిగతంగా భారత్ తో ఆడడాన్ని తాను బాగా ఆస్వాదించానని అన్నాడు. తన కెరీర్ కు అది ఎంతో ఉపయోగపడిందని ఇంజమామ్ తెలిపాడు. భారత్-పాక్ మధ్య సిరీస్ ఇంగ్లండ్-ఆస్ట్రేలియా దేశాల మధ్య జరిగే యాషెస్ కంటే ఎంతో పెద్దదని అభిప్రాయపడ్డాడు. 

More Telugu News