: ఏపీవైపు దూసుకొస్తున్న ‘వార్దా’.. నేడు తీవ్ర తుపానుగా మారే అవకాశం

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘వార్దా’ తుపాను మరింత బలపడి నేడు (శనివారం) తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖపట్టణంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. తుపాను శుక్రవారం రాత్రి విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 950 కిలోమీటర్ల దూరంలో, మచిలీపట్నానికి 1050 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. నెల్లూరు, మచిలీపట్నం మధ్య సోమవారం తీరాన్ని తాకే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే గంటకు రూ.45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా తుపాను నేపథ్యంలో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు హెచ్చరికలు జారీ చేశారు.

More Telugu News