: అందరూ డుమ్మా కొట్టారు.. అధికార, ప్రతిపక్ష సభ్యులు లేక వెలవెలబోయిన రాజ్యసభ .. ఉభయ సభలు 14కి వాయిదా

పార్లమెంటు ఉభయసభలు ప్రారంభం కావడం, గందరగోళం నెలకొనడం, ఏ చర్చా జరగకుండా వాయిదా పడడం.. 18 రోజులుగా ఇదే తీరు కనపడుతున్న విషయం తెలిసిందే. ఇక మిగిలింది 12 రోజులు మాత్ర‌మే. అందులోనూ ఎన్నో సెల‌వు రోజులు ఉన్నాయి. ఎన్నో అంశాల‌పై చ‌ర్చించాల్సిన ఉభ‌య‌స‌భ‌లు ప్రారంభ‌మైన కొన్ని నిమిషాల‌కే వాయిదా పడుతున్నాయి. వాయిదాల ప‌ర్వంపై రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్‌ముఖ‌ర్జీతో పాటు బీజేపీ ఎంపీ అద్వానీ, లోక్‌స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ అస‌హ‌నం వ్యక్తం చేశారు. ఈ నేప‌థ్యంలో ఈ రోజు రాజ్యసభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం మ‌రోసారి కొన‌సాగింది. అయితే, మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా అనంత‌రం ప్రారంభ‌మైన రాజ్య‌స‌భ‌ అధికార, ప్రతిపక్ష సభ్యులు లేక సభ వెలవెలబోయింది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గులాంనబీ ఆజాద్‌, అనంద్‌శర్మతో పాటు మ‌రో రాజ్య‌స‌భ‌ సభ్యుడు మాత్రమే క‌నిపించారు. అధికార పార్టీ సభ్యులు కూడా అతి త‌క్కువ మంది క‌నిపించారు. దీంతో స‌భ బోసిపోయి క‌నిపించింది. దీంతో డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ సభను ఈ నెల 14 వ‌ర‌కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మ‌రోవైపు లోక్‌స‌భ‌లో పెద్ద‌నోట్ల ర‌ద్దుపై చ‌ర్చ‌కు సిద్ధ‌మేన‌ని అధికార పక్ష స‌భ్యులు ప్ర‌క‌టించారు. అయితే, ఆ త‌రువాత ఓటింగ్‌కు మాత్రం అంగీక‌రించ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో ఆందోళ‌న‌ను కొన‌సాగించిన విప‌క్ష స‌భ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో అధికార పక్ష నేతలు స్పందించి ఆందోళన చేసుకోవాలంటే జంతర్ మంతర్ లాంటి వేదికలు ఉన్నాయని, అక్కడికెళ్లి నిరసనను తెలపాలని అన్నారు. మరోవైపు స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను సజావుగా సాగనీయాలని కోరిన‌ప్ప‌టికీ పరిస్థితిలో మార్పురాక‌పోవ‌డంతో సభను ఈ నెల 14వ తేదీ వరకూ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

More Telugu News