: ఆ మహిళను ముంబయికు తీసుకువచ్చేందుకు ఏ విమానయాన సంస్థ ముందుకు రావట్లేదు!

సుమారు అరటన్ను బరువు ఉన్న ఈజిప్టు కు చెందిన ఎమాన్ అహ్మద్ (36) అనే మహిళ గుర్తుండే ఉంటుంది. భారీ స్థూలకాయం కారణంగా దాదాపు ఇరవై ఐదేళ్లుగా ఆమె మంచానికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఆమె బరువును తగ్గించే నిమిత్తం వైద్యం చేసేందుకు ముంబయి వైద్యులు ముందుకు వచ్చారు. దీంతో, ఆమె ఎంతో సంతోషపడింది. అయితే, ఇక్కడికి వచ్చేందుకు ఆమెకు వీసా లభించలేదు. మన విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ జోక్యంతో ఆ సమస్య కూడా తీరిపోయింది. కానీ, మరో సమస్య వచ్చిపడింది. ఈజిప్ట్ లోని కైరో నుంచి ఆమెను ముంబయికి తీసుకువచ్చేందుకు ఏ విమానయాన సంస్థే కాదు, ఏ చార్టర్ ఫ్లైట్ కూడా ముందుకు రావడం లేదు. దీంతో, ఎమాన్ అహ్మద్, ఆమె కుటుంబసభ్యులు ఆవేదన చెందుతున్నారు. కాగా, ఈజిప్టు నుంచి ముంబయికి నేరుగా విమానాలు లేకపోగా, చార్టర్ విమానాలు కూడా అందుబాటులో లేవు. జెట్ ఎయిర్ వేస్ నిబంధల ప్రకారం.. 136 కిలోల లోపు బరువు ఉన్న రోగులను మాత్రమే స్ట్రెచర్ ద్వారా అనుమతిస్తారు. ఈ నిబంధన ‘ఎయిర్ ఇండియా’లో లేదు. కానీ, ముంబయి నుంచి అక్కడికి నేరుగా విమాన సర్వీసులు లేవు. జర్మనీ ఫ్రాంక్ ఫర్ట్ వరకు మాత్రమే అవకాశం ఉందని, ప్రపంచంలోనే అధిక బరువు ఉన్న మహిళగా రికార్డుల్లోకి ఎక్కిన ఎమాన్ అహ్మద్ కుటుంబసభ్యులు ఈ మేరకు చేసిన అభ్యర్థనను పరిశీలిస్తున్నామని ఎయిర్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అశ్విని లోహాని పేర్కొన్నారు.

More Telugu News