: తమిళనాడుకు ఏమైంది? ఓవైపు ‘అమ్మ’.. మరోవైపు కరుణ.. అనారోగ్యంతో పార్టీల అధినేతలు

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కరుణానిధి.. ప్రస్తుతం వీరిద్దరూ అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడంతో రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రాన్ని శాసిస్తున్న రెండు ప్రధాన పార్టీల నేతలు ఆస్పత్రి పాలవడంపై ఇరు పార్టీల కార్యకర్తలు, అభిమానుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. సెప్టెంబరు 22 నుంచి చెన్నైలోని అపోలో ఆస్ప్రతిలో చికిత్స పొందుతున్న జయలలిత ఆరోగ్యం ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా క్షీణించిన విషయం తెలుసుకున్న అభిమానులు, కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. తమిళనాడు విషాదంలో మునిగిపోయింది. ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు కేంద్రమంత్రులు ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. మరోవైపు అలెర్జీ, డీహైడ్రేషన్, పోషకాల లేమితో బాధపడుతూ గురువారం తెల్లవారుజామున చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చేరిన కరుణానిధి మరో రెండు రోజుల్లో ఇంటికి చేరుకుంటారని సమాచారం. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ఇదే సమస్యతో ఆయన ఆస్పత్రిలో చేరడం నెల రోజుల్లో ఇది రెండోసారి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరుణను పరామర్శించేందుకు ఆదివారం పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆస్పత్రికి చేరుకున్నారు. కూతురు కనిమొళిని అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అలాగే పలు ప్రధాన పార్టీల నేతలు కూడా ఆస్పత్రికి చేరుకుని కరుణానిధి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. కరుణానిధి పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని కనిమొళి తెలిపారు. మరో రెండు రోజుల్లో ఆయన ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకుంటారని పేర్కొన్నారు.

More Telugu News