: ఏపీ బ్యాంకుల్లో డ‌బ్బులు నిండుకున్నాయ్‌.. నేడు క‌నుక డ‌బ్బు రాకుంటే ఇక్కట్లే!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని బ్యాంకుల ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. డ‌బ్బుల్లేక బ్యాంకులు ఖాళీ అయిపోతున్నాయి. బ్యాంకుల ముందు 'నో క్యాష్‌' బోర్డులు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. దీంతో ప్ర‌జ‌లు అవ‌స్థ‌ల పాల‌వుతున్నారు. నేటి మ‌ధ్యాహ్నం క‌ల్లా రిజ‌ర్వు బ్యాంకు నుంచి డ‌బ్బులు చేర‌కుంటే ప‌రిస్థితి దారుణంగా ఉంటుంద‌ని చెబుతున్నారు. నోట్ల కొర‌త ఎంత దారుణంగా ఉందంటే రోజువారీ లావాదేవీలు కూడా జ‌ర‌ప‌లేని స్థితికి బ్యాంకులు చేరుకున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రిజ‌ర్వు బ్యాంకు పంపిన రూ.2 వేల నోట్లు మార్పిడి కోస‌మే స‌రిపోయాయి. బ్యాంకుల ద‌గ్గ‌ర ఉన్న‌, డిపాజిట్ల ద్వారా వ‌చ్చిన చిన్న నోట్ల‌ను ఏటీఎంల‌లో స‌ర్దేశారు. ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన నోట్లు వారి చేతుల్లో చిక్కుకుపోయాయి. ఏపీలోని ప‌ది జిల్లాల్లోని బ్యాంకుల వ‌ద్ద న‌గ‌దు పూర్తిగా నిండుకుంది. పూర్తిస్థాయిలో డ‌బ్బులు లేక‌పోవ‌డంతో అత్య‌వ‌స‌రంగా వ‌చ్చిన ఖాతాదారుల‌కు మాత్రం రూ.4 వేల నుంచి రూ.10 వేల వ‌ర‌కు ఇచ్చి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రిజ‌ర్వు బ్యాంకు నుంచి నేడు (శ‌నివారం) డ‌బ్బులు రాక‌పోతే ఖాతాదారుల‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌లేని ప‌రిస్థితికి చేరుకుంటాయ‌ని స్వ‌యంగా అధికారులే చెబుతున్నారు. విజ‌య‌వాడ‌లోని ఎస్‌బీఐ, ఎస్‌బీహెచ్‌, ఆంధ్రాబ్యాంకుల్లో మాత్రం కొంత మొత్తం ఉండ‌గా మిగ‌తా బ్యాంకుల్లో న‌గ‌దు నిల్వ‌లు పూర్తిగా అడుగంటాయి. దీంతో అటు అధికారులు స‌హా ఇటు ప్ర‌జ‌ల్లోనూ ఆందోళ‌న నెల‌కొంది.

More Telugu News