: పార్లమెంటుపై ప్రధానికి ఉన్న గౌరవం ఇదేనా?: గులాం నబీ ఆజాద్.. రాజ్యసభ వాయిదా

రాజ్యసభ ఆరంభం నుంచే విపక్షాలు తమ ఆందోళన చేపట్టాయి. నోట్ల రద్దుపై ప్రధాని సభలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. దీంతో డిప్యూటీ ఛైర్మన్ కురియన్ మాట్లాడుతూ, 'చర్చ మధ్యలో ప్రధాని వస్తానంటున్నారు, దీనిపై నిన్ననే హామీ ఇచ్చారు... మీరేమంటారు గులాం నబీ ఆజాద్?' అంటూ అడిగారు. దీంతో ఆజాద్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటుకు వచ్చి విపక్షాలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే పార్లమెంటులో ఉన్న లైబ్రరీ హాల్ లో పుస్తకావిష్కరణకు వచ్చి, పెద్ద పెద్ద ప్రసంగాలు ఇవ్వడానికి సమయమున్న ప్రధానికి పార్లమెంటుకు రావడానికి సమయం లేదా? అని అడిగారు. పార్లమెంటుపై ప్రధానికి ఉన్న గౌరవం ఇదేనా? అని ఆయన నిలదీశారు. ప్రతిపక్షాలంటే ఇంత చిన్నచూపా? అని ఆయన అడిగారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించేవాళ్లంతా దేశభక్తులు, సమర్థించని వారంతా దేశద్రోహులుగా ముద్రవేస్తున్నారని, వారందర్నీ ప్రధాని క్షమాపణ అడగాలని వారు డిమాండ్ చేశారు. అంతవరకు చర్చ జరగదని స్పష్టం చేశారు. తరువాత ఎంతసేపటికీ ఆందోళన సద్దుమణగకపోవడంతో సభను డిప్యూటీ ఛైర్మన్ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.

More Telugu News