: శవాలపై డబ్బులేరుకోవడం అంటే ఇదే... నాటకం రక్తికట్టించే క్రమంలో పట్టుబడింది!

ఇండోర్-పాట్నా రైలు ప్రమాదాన్ని సంపాదనకు ఆయుధంగా మలచుకోవాలని ప్రయత్నించిన ఓ మహిళ పట్టుబడిన ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. డీఎస్పీ పవిత్ర మోహన్ త్రిపాఠి చెప్పిన వివరాల్లోకి వెళ్తే... పాట్నా ప్రాంతానికి చెందిన ప్రీతి అనే మహిళ మాటి పోస్టు మార్టం హౌస్ కు వచ్చింది. రైలు ప్రమాదంలో తన సోదరుడు రాహుల్ మరణించాడంటూ చెప్పి, ఓ మృతదేహాన్ని గుర్తించి తెగ కన్నీరు పెట్టుకుంది. పోస్టుమార్టం చేసిన ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే డెడ్ బాడీని తీసుకెళ్లే క్రమంలో ఆమె పదేపదే నష్టపరిహారం ఎప్పుడొస్తుందంటూ పలువుర్ని ప్రశ్నించింది. ఇదే విషయాన్ని డాక్టర్లను కూడా అడిగింది. దీంతో అనుమానం వచ్చిన వైద్యులు పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు ఆమెను అడ్రస్ ప్రూఫ్ అడిగారు. ఆమె తన ఐడెంటిటీ కార్డుని ఇవ్వకుండా, వేరే అడ్రస్ లు ఇచ్చింది. ఇంతలో ఆమె పాపం పండడంతో, ఆ డెడ్ బాడీకి సంబంధించిన తండ్రి దీనా విశ్వకర్మ వచ్చారు. వస్తూనే ఆయన ఆ మృతదేహం తన కొడుకు రిషు (30) దిగా గుర్తించారు. ఆయన తన ఐడీ కార్డు చూపించారు. దీంతో ఆమె అసలు రంగు బట్టబయలైంది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా, ఆమె భాగోతం బయటపడింది. దీంతో పోలీసులు విచారించగా, తన పేరు అలియా పర్విన్ అని, వారణాసిలోని గాడౌలియా ప్రాంతానికి చెందిన మహిళనని తెలిపింది. రైలు ప్రమాద బాధితులకు భారీ మొత్తంలో పరిహారం ఇస్తున్నారని తెలిసి దాని కోసం ఈ నాటకం ఆడినట్టు తెలిపింది. దీంతో ఆమెను రిమాండుకు తరలించారు.

More Telugu News