: ఫలించిన టీమిండియా రివ్యూ... ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్

విశాఖ టెస్టులో టీమిండియా ఆధిక్యం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలిరోజు ఇంగ్లండ్ బౌలర్లపై టీమిండియా బ్యాట్స్ మన్ ఆధిపత్యం ప్రదర్శించగా, రెండో రోజు బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. వరుసగా వికెట్లు తీస్తూ ఇంగ్లండ్ పై ఒత్తిడి పెంచుతున్నారు. డీఆర్ఎస్ విధానాన్ని తొలిసారి వినియోగించుకున్న టీమిండియా రివ్యూకు వెళ్లింది. 35వ ఓవర్ 4వ బంతిని జయంత్ యాదవ్ ఆఫ్ స్టంప్ పై సంధించాడు. ఇది మొయిన్ అలీ ప్యాడ్ ను ముద్దాడుతూ వెళ్లి బ్యాటును తాకింది. దీంతో అవుటయ్యాడని భావించిన జయంత్ యాదవ్ కొహ్లీని రివ్యూకి వెళ్లాలని కోరాడు. బౌలర్ పై నమ్మకముంచిన కోహ్లీ తొలిసారి డీఆర్ఎస్ విధానంలో రివ్యూ కోరాడు. దీంతో థర్డ్ అంపైర్ బంతిని వివిధ కోణాల్లో పరిశీలించి, బంతి బ్యాటు కంటే ముందే ప్యాడ్ ను ముద్దాడిందని, అది వికెట్లను గిరాటేసే బంతే అని నిర్ధారించి అవుట్ గా ప్రకటించాడు. దీంతో ఐదో వికెట్ గా మొయిన్ అలీ (1) పెవిలియన్ చేరాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు 37 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. క్రీజులో బెన్ స్టోక్స్ (2) కు జతగా బెయిర్ స్టో (1) ఉన్నాడు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ రెండు, షమి, జడేజా, జయంత్ యాదవ్ ఒక్కో వికెట్ తీశారు.

More Telugu News