: నేడు ఏపీకి రానున్న సచిన్... పుట్టంరాజు కండ్రిగలో పండగ వాతావరణం

క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ తన దత్తత గ్రామానికి రానున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా పుట్టంరాజు కండ్రిగలో పండగ వాతావరణం నెలకొంది. నేటి ఉదయం 11 గంటలకు సచిన్ ఆ గ్రామానికి చేరుకుంటారు. గ్రామంలో 1.15 కోట్ల రూపాయలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ ను ఆయన ప్రారంభిస్తారు. ఆ తరువాత గ్రామస్థులతో స్వచ్ఛభారత్‌ పై ముఖాముఖి నిర్వహించి, ఊరంతా పర్యటించి, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక వసతులను పరిశీలించనున్నారు. తరువాత 1.60 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న గొల్లపల్లి, నెర్నూరు గ్రామాల్లోని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన క్రీడా మైదానంలో యువకులకు క్రీడా పరికరాలు అందజేయనున్నారు. దీంతో గ్రామంలో పండగ వాతావరణ నెలకొనగా, యువకులంతా సచిన్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. సచిన్ ను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఉత్సాహం చూపడం విశేషం. అనంతరం ఆయన ముంబై బయల్దేరి వెళతారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు సచిన్ టెండూల్కర్ పుట్టంరాజు కండ్రిగను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ఎంపీ లాడ్స్ నుంచి 2.80 కోట్ల రూపాయలు ఈ గ్రామానికి కేటాయించిన సంగతి తెలిసిందే.

More Telugu News