: పార్లమెంట్‌ ప్రాంగణంలో అనుమతులు లేకుండా ఇంటర్వ్యూలు తీసుకోకూడదు: లోక్‌ సభ కార్యదర్శి

రేపటి నుంచి ప్రారంభం కానున్న‌ పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు గ‌రంగరంగా కొన‌సాగ‌నున్న‌ట్లు సంకేతాలు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. పెద్దనోట్ల ర‌ద్దు అంశంపై ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఏక‌మై కేంద్ర‌ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్ట‌డానికి అన్ని వ్యూహాలు ర‌చించుకున్నాయి. మ‌మ‌తా బెన‌ర్జీ ఆధ్వ‌ర్యంలో ప్ర‌తిప‌క్ష‌నేత‌లు రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీని కూడా క‌ల‌వ‌నున్నారు. మ‌రోవైపు, వ‌చ్చే ఏప్రిల్ 1 నుంచి దేశంలో జీఎస్‌టీ స‌వ‌ర‌ణ బిల్లును అమ‌లుచేయాల‌ని భావిస్తోన్న ఎన్డీఏ ప్ర‌భుత్వం అందుకు సంబంధించిన ప‌లు కీలక బిల్లులను ఈ సమావేశాల్లోనే ఆమోదించాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో పార్ల‌మెంటు వ‌ద్ద‌ మీడియాకు ప‌లు నిబంధ‌న‌లు విధిస్తున్న‌ట్లు లోక్‌ సభ కార్యదర్శి తెలిపారు. పార్లమెంటులోకి మంత్రులు, పార్ల‌మెంటు స‌భ్యులు త‌ప్ప వేరెవ్వ‌రూ రాకూడ‌ద‌ని సూచించారు. త‌మ‌ అనుమతులు తీసుకోకుండా విలేక‌రులు పార్ల‌మెంటు వ‌ద్ద నేత‌ల నుంచి ఇంటర్వ్యూలు, ఫొటోలు తీసుకోరాద‌ని చెప్పారు. పార్లమెంట్‌ గేట్‌ 1 వద్ద కూడా మీడియా ఇంటర్వ్యూలు తీసుకోవ‌డానికి అనుమతి ఇవ్వ‌డం లేద‌ని పేర్కొన్నారు. ఈ నియ‌మ‌ నిబంధ‌న‌లు పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు పూర్తి అయ్యేవరకు ఉంటాయ‌ని చెప్పారు. మీడియా సిబ్బంది ఒకవేళ నేత‌ల నుంచి ఇంట‌ర్వ్యూలు తీసుకోవాల్సి ఉంటే పార్లమెంట్‌ ప్రెస్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌ వింగ్‌ నుంచి అనుమ‌తులు తీసుకోవాల్సి ఉంటుంద‌ని పేర్కొన్నారు.

More Telugu News