: బలూచిస్థాన్‌లో బాంబు పేలుడు.. 52 మంది దుర్మరణం.. తమ పనేనన్న ఐఎస్

పాకిస్థాన్‌లోని ఓ సూఫీ ప్రార్థనా మందిరంపై శనివారం రాత్రి జరిగిన బాంబు దాడిలో 52 మంది దుర్మరణం చెందారు. మరో వందమందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ప్రకటించింది. బలూచిస్థాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాకు 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ సూఫీ ప్రార్థనా మందిరంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 52 మంది మృతి చెందగా 105 మంది గాయపడినట్టు ప్రావిన్షియల్ హోంమంత్రి సర్ఫరాజ్ బుగ్తి తెలిపారు. బాధితుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. బద్ధవిరోధులైన సున్నీ, షియా ముస్లింలు ఈ ప్రార్థనా మందిరంలో ప్రార్థనలు నిర్వహించుకోవడం ఇక్కడ ప్రత్యేకత. ఇది ఇస్లాంకు వ్యతిరేకమంటూ తాలిబన్, ఇస్లామిక్ స్టేట్ సంస్థలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే ఐఎస్ ఈ దుశ్చర్యకు పాల్పడింది. ఈ దాడి తమ పనేనని ఐఎస్ అనుబంధ న్యూస్ ఏజెన్సీ అమాఖ్ తెలిపింది. ఐఎస్ ఆత్మాహుతి దళ సభ్యుడు దాడికి పాల్పడినట్టు పేర్కొంది. అయితే ఇది ఆత్మాహుతి దాడా? మరేదైనానా? అనే విషయంలో స్పష్టత లేదని హోంమంత్రి తెలిపారు.

More Telugu News