: హిల్లరీకి మద్దతు పలికిన యాపిల్ చీఫ్ టిమ్ కుక్... ట్రంప్ గెలుపు తరువాత ఉద్యోగులకు ఏం చెప్పారంటే..!

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు డెమోక్రాట్ల అభ్యర్థిని హిల్లరీ క్లింటన్ కు బహిరంగంగా మద్దతు పలికి, ట్రంప్ ను ఓడించాలని పిలుపునిచ్చిన యాపిల్ చీఫ్ టిమ్ కుక్, ట్రంప్ విజయం తరువాత తన ఉద్యోగులకు లేఖ రాశారు. ఎవరు గెలిచినా, ఓ ఉమ్మడి కుటుంబం వంటి యాపిల్ ముందుకు సాగుతూనే ఉంటుందని అన్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, ఆయన ట్రంప్ పేరును తన లేఖలో ఎక్కడా ప్రస్తావించ లేదు. "ఉద్యోగుల్లో చాలా మంది చాలా రోజులుగా అధ్యక్ష ఎన్నికల గురించి చర్చించారని నాకు తెలుసు. రాజకీయాల్లో ఒక్కొక్కరు ఒక్కో విధమైన అభిప్రాయాలను చెబుతూ ఓట్లను అభ్యర్థిస్తారు. ఆపై విజయం తరువాత పరిస్థితి దేశ భద్రత, ప్రయోజనాలకే పెద్దపీట వేసేలా ఉంటుంది. ఇక్కడ నాకు 50 ఏళ్ల క్రితం డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చెప్పిన ఓ సూక్తి గుర్తుకు వస్తోంది. "నువ్వు ఎగరలేకపోతే పరిగెత్తు. పరిగెత్తలేకపోతే నడక అందుకో. నడవలేకపోతే పాకుతూ వెళ్లు. ఏది ఏమైనా నువ్వు మాత్రం ముందుకు సాగుతూ ఉండాల్సిందే" ఓ కుటుంబంలా కలిసుండే యాపిల్ సంస్థకూ ఇదే సూక్తి వర్తిస్తుంది. మన ఉత్పత్తులు ప్రపంచంలోని ప్రజలను కలిపి ఉంచుతున్నాయి. అందరమూ కలిసి ముందుకు సాగుదాం" అని టిమ్ కుక్ తెలిపారు.

More Telugu News